
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కామేపల్లి/కారేపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రగాయాల పాలై మృతి చెందాడు. కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాకు చెందిన వాంకుడోత్ సాయికుమార్ (22) తన స్నేహితుడైన భూక్యా కుమార్‌తో కలిసి పనినిమిత్తం బైక్‌పై మంగళవారం ఖమ్మం వెళ్లారు. తిరిగి రాత్రి బైక్‌పై వస్తుండగా కామేపల్లి మండలం మర్రిగూడెం స్టేజీ సమీపాన గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ వాహనం సాయికుమార్ పొట్ట మీదుగా వెళ్లడంతో పొట్టభాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడిన కుమార్‌ను స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సాయికుమార్ తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో మూడు నెలల జైలుశిక్ష
ఖమ్మంలీగల్: చెల్లించాల్సిన అప్పు కింద ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో మూడు నెలలు జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి బెక్కమ్ రజని బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం పాకబండబజార్‌కు చెందిన తనుకు వెంకటేశ్వర్లు వద్ద చిట్టుమొదు వెంకటేశ్వర్లు 2022 జనవరిలో రూ.3.20లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2022 జూలైలో చెక్కు ఇవ్వగా, తనుకు వెంకటేశ్వర్లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తే చిట్టుమొదు వెంకటేశ్వర్లు ఖాతాలో సరిపడా నగదు లేనందున తిరస్కరణకు గురైంది. దీంతో బాధితుడు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయగా విచారణ అనంతరం జైలుశిక్షతో పాటు ఫిర్యాదికి రూ.3.20 లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు గాయాలు
ముదిగొండ: ఖమ్మం – కోదాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు గాయాలయ్యాయి. నేలకొండపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఆటోకు ముదిగొండ సమీపాన జాతీయ రహదారిపై కుక్క అడ్డొచ్చింది. దీంతో అదుపు తప్పిన ఆటో పల్టీకొట్టగా డ్రైవర్ సాయికి గాయాలయ్యాయి. స్థానికులు 108లో క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.