● రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారుల అవస్థలు ● సర్వర్ సమస్యతో బియ్యం పంపిణీలో జాప్యం ● ఇంకొన్ని షాప్‌లకు స్టాక్ చేరక ఎదురుచూపులు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్ దుకాణాల ద్వారా ఒకేసారి మూడు నెలలకు సంబంధించి సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నా.. పంపిణీలో జాప్యం మాత్రం వారిని ఆవేదనకు గురిచేస్తోంది. తొలుత ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడం, ఆతర్వాత సర్వర్ మొరాయింపు, స్టాక్ లేకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు ఈనెల 20 వరకు తిప్పలు పడ్డారు. కొన్నిరోజుల పాటు చాలా దుకాణాలు మూసేసి ఉండడం, మరికొన్ని దుకాణాల్లో స్టాక్ లేకపోవడంతో షాప్‌ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది. ఈనెల 30 వరకు బియ్యం పంపిణీ చేస్తామని చెబుతున్నా... ఈ–పాస్ యంత్రంలో మాత్రం ఈనెల 29 వరకే సరఫరా జరుగుతుందంటూ డిస్‌ప్లే వస్తుండడం గమనార్హం. ఈనేపథ్యాన జిల్లాలోని పలుచోట్ల రేషన్‌షాప్‌ల్లో ‘సాక్షి’ పరిశీలించగా అనేక సమస్యలు వెలుగుచూశాయి.
85 శాతం పంపిణీ..
రేషన్ దుకాణాల ద్వారా మంగళవారం సాయంత్రం వరకు 85.22 శాతం లబ్ధిదారులకు బియ్యం పంపిణీ పూర్తయింది. జిల్లాలో మొత్తం 4,15,904 రేషన్‌కార్డులు ఉండగా.. 3,54,466 మంది కార్డుదారులకు బియ్యం అందించారు. అయితే, జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల వారు పెద్దసంఖ్యలో స్థిరపడగా వారు పోర్టబులిటీ విధానంలో బియ్యం తీసుకున్నారు. దీంతో చాలా షాపుల్లో స్టాక్ అయిపోయి మిగతా లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వస్తోంది. ఈమేరకు డీలర్లు అదనపు స్టాక్ కోసం ఇండెంట్ పంపినా సరఫరాలో జాప్యం జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఒకేసారి మూడు నెలల బియ్యం ఇస్తుండడం.. అదీ సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద బారులు దీరుతున్నారు. ఈనెల 20వరకు ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లు కనిపించాయి. జిల్లా కేంద్రంతో పాటు సమీప మండలాల్లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంటోంది. కాగా, కొందరు లబ్ధిదారులు రద్దీ తగ్గాక తీసుకోవాలనే భావనతో వేచిఉండగా ఇప్పుడు వారి సమీపంలోని షాప్‌లు మూతపడడంతో బియ్యం ఎప్పుడొస్తాయని ఆరా తీస్తున్నారు.
తిప్పలు.. తప్పడం లేదు