
రైతు భరోసా సంపూర్ణం
● తొమ్మిది రోజుల్లో పెట్టుబడి సాయం జమ ● జిల్లాలో 3.53లక్షల మంది రైతులకు రూ.436.84 కోట్లు ● రైతువేదికల్లో సీఎం ప్రసంగాన్ని వీక్షించిన అన్నదాతలు
ఖమ్మంవ్యవసాయం: పంటల సాగుకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకం ద్వారా జిల్లాలో అర్హులైన రైతులకు నగదు జమ అయింది. ఈనెల 16న ఎకరాకు రూ.6వేల నగదు జమ చేయడం మొదలుపెట్టగా తొమ్మిది రోజుల్లో మంగళవారం నాటికి పూర్తయింది. జిల్లాలో రైతు భరోసా పథకానికి 3,53,794 మంది రైతులను అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం, వారికి ఉన్న సాగు భూమి ఆధారంగా రూ.436,84,65,365 కోట్లను కేటాయించింది. సోమవారం నాటికి 15ఎకరాల వరకు భూమి కలిగిన 3,31,397 మంది ఖాతాల్లో రూ.406,36,62,570 జమ చేసిన ప్రభుత్వం మిగిలిన 22,397మంది రైతుల ఖాతాల్లో రూ.30,48,02,795 నగదును మంగళవారం జమ చేసింది.
రైతు వేదికల ద్వారా విజయోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు వేదికల ద్వారా విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొనగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతువేదికల్లో వీక్షణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులు, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కూసుమంచిలోని రైతు వేదికలో కలెక్టర్ అనుదప్ దురిశెట్టి, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆధ్వర్యాన గ్రామాల్లో సీఎం, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
కూసుమంచి: వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యాన జిల్లా రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కూసుమంచిలోని రైతు వేదికలో రైతు భరోసా సంబురాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3.53లక్షల మందికి రైతులకు పెట్టుబడి సాయంగా రూ.430 కోట్ల మేర జమ అయ్యాయని చెప్పారు. ఎక్కడ కూడా ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నామని, ఎక్కడైనా సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే, రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య, సెరి కల్చర్ అధికారి ముత్యాలు, ఏడీఏ సరిత, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.

రైతు భరోసా సంపూర్ణం