ఏదులాపురం.. ఎప్పుడూ అంతే | - | Sakshi
Sakshi News home page

ఏదులాపురం.. ఎప్పుడూ అంతే

Jun 24 2025 3:49 AM | Updated on Jun 24 2025 3:49 AM

ఏదులాపురం.. ఎప్పుడూ అంతే

ఏదులాపురం.. ఎప్పుడూ అంతే

● పీఏసీఎస్‌పై ఆది నుంచి ఆరోపణలు ● అవినీతితో గత చైర్మన్‌ సస్పెండ్‌ ● ప్రస్తుత చైర్మన్‌ రైతుల పేరిట రుణాలు తీసుకున్నాడనే ఆరోపణలతో విచారణ

ఖమ్మంరూరల్‌: రూరల్‌ మండలంలోని ఏదులాపురం పీఏసీఎస్‌కు ఎంపికవుతున్న పాలకవర్గాల తీరుతో తరచుగా విమర్శలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, మారుపేర్లతో రుణాల స్వాహా, రైతులకు రుణ మంజూరుకు పర్సంటేజీల వసూళ్లతో సొసైటీకి మచ్చలే మిగులుతున్నాయి. పాలకవర్గంలోని పలువురు ‘నీకు ఇంత.. నాకు ఎంత’ అన్న చందంగా వ్యవహరిస్తుండడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుత చైర్మన్‌ సొసైటీ పరిధిలోని పలువురు రైతులను మచ్చిక చేసుకుని రుణాలు ఇప్పించి.. ఆపై వాటా తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత చైర్మన్‌ హయాంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు అందగా చైర్మన్‌తో పాటు సీఈఓపై సస్పెన్షన్‌ వేటు పడింది.

ప్రస్తుత చైర్మన్‌ నిర్వాకం

ఏదులాపురం సొసైటీ నుంచి తమ పేరుతో చైర్మన్‌ జర్పుల లక్ష్మణ్‌నాయక్‌ రుణాలు తీసుకున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్న విషయం విదితమే. రైతుల సంతకాలు తీసుకుని రుణాలు ఇప్పించినా, వారికి చెప్పిన దాని కంటే ఎక్కువ రుణం తీసుకున్నట్లు ఆలస్యంగా గుర్తించారు. అంతేకాక ఆ రుణం చెల్లించాల్సిన పని లేదని, మాఫీ అవుతుందని ఆయన నమ్మబలికినట్లు సమాచారం. కానీ మాఫీ కాకపోవడంతో బకాయిలు చెల్లించాలని సొసైటీ ఉద్యోగులు నోటీసులు జారీ చేస్తుండగా రైతులు ఆందోళనతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ తాము రూ.50వేల రుణమే తీసుకుంటే రూ.లక్ష రుణం అప్పుగా చూపిస్తుండడంతో ఎటూ పాలుపోని స్థితి ఎదుర్కొంటున్నామని వాపోయారు. సొసైటీ పరిధిలోని గుండాలతండా, గూడురుపాడు తదితర గ్రామాల రైతుల పేరిట దాదాపు రూ.50లక్షల మేర రుణాలను చైర్మన్‌ లక్ష్మణ్‌నాయక్‌ తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సొసైటీల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఉషశ్రీని విచారణకు నియమించడంతో ఆమె వారం క్రితం సొసైటీకి వచ్చి రైతుల వద్ద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. రైతుల పేరిట అందిన దరఖాస్తులు, వారికి మంజూరైన రుణం, అందులో ఎంత మేర చైర్మన్‌ తీసుకున్నాడనే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణలో పురోగతి లేకపోవడంతో చైర్మన్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తేలలేదు. మరోపక్క బాకీ చెల్లించాలని సొసైటీ ఉద్యోగుల నుంచి నోలీసులు వస్తుండడంతో ఉన్నతాధికారులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిక..

సొసైటీ చైర్మన్‌ లక్ష్మణ్‌నాయక్‌పై వచ్చిన ఆరోపణల మేరకు విచారణ చేపట్టాం. ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. ఆపై పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాం. తదుపరి చర్యలపై ఆదేశాలు రావాల్సి ఉంది.

– ఉషశ్రీ, అసిస్టెంట్‌ రిజిష్ట్రార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement