
అదుపు తప్పిన ద్విచక్రవాహనం
కారేపల్లి: ద్విచక్రవాహనం అదుపుతప్పగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని ఉసిరి కాయలపల్లికి చెందిన ఎస్‌డీ.అమీర్(52), భాగ్యనగర్‌తండా గ్రామానికి చెందిన గుగులోతు మంగు సోమవారం మాదారం జరగనున్న సీపీఐ మండల మహాసభ ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం బైక్‌పై వెళ్లారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వారిద్దరు ఉసిరికాయలపల్లి వైపు వస్తుండగా జమాళ్లపల్లి వద్దద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయింది.ఈ ఘటనలో అమీర్ అక్కడికక్కడే మృతి చెందగా, మంగుకు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయాడు. అర్ధరాత్రి కావడంతో ఆ మార్గంలో ఎవరూ వెళ్లకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. సోమవారం ఉదయం మంగుకు స్పృహ రాగా 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చేరుకుని అమీర్ మృతదేహంతో పాటు మంగును ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. మృతుడు అమీర్ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తుండగా, మంగు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. కాగా, అమీర్ మృతితో సీపీఐ మండల మహాసభను వాయిదా వేయగా, ఆయన మృతదేహం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు. నాయకులు భాగం హేమంతరావు, యర్ర బాబు, ఏపూరి లతాదేవి, శివరామ్, సారయ్య, ఉంగరాల సుధాకర్, ధన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఒకరు మృతి, మరొకరికి గాయాలు