
చిక్కుముడి
మాఢవీధుల విస్తరణకు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అభివృద్ధికి చేపట్టిన మాఢవీధుల విస్తరణకు అడ్డు తొలగడం లేదు. దాదాపు అందరూ ఖాళీ చేసినా ఓ రెండు కుటుంబాల పేచీతో భూ సేకరణ పూర్తి కాలేదు. భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. దీంతో భక్తులకు ఎదురుచూపులు తప్పడంలేదు.
మేము నష్టపోయామంటున్న నిర్వాసితులు
ప్రభుత్వంపై నమ్మకంతో రామాలయ అభివృద్ధికి సహకరించేందుకు ఆలయానికి పడమర, దక్షిణం వైపున ఉన్న చిరు వ్యాపారులు, ఇళ్ల యజమానులు గత నెల 10వ తేదీ తర్వాత ఖాళీ చేశారు. నష్టపరిహారం పూర్తిగా అందించలేదని, ప్రత్యామ్నాయఇంటి స్థలం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూనే తమ నివాసాలను ఖాళీ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వారు జేసీబీలతో ఇళ్లను కూల్చేశారు.నెల రోజులు దాటినా ఇతర ఇళ్లను ఖాళీచేయించలేదు. దీంతో తాము వ్యాపారం నష్టపోయామనిఖాళీ చేసిన నిర్వాసితులు పేర్కొంటున్నారు.
పుష్కరాల నాటికై నా అవుతాయా..?
రామాలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అంటున్నా ప్రభుత్వ చిత్తశుద్ధిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 18 నెలలు కావొస్తున్నా అభివృద్ధిలో కీలక ఘట్టమైన మాఢ వీధుల విస్తరణ భూ సేకరణకే నెలలపాటు సమయం తీసుకోవడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. భూ సేకరణ పూర్తయి, మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించి, విడతలవారీగా బడ్జెట్ విడుదలైతేనే పనులు పూర్తవుతాయి. ఆ పనులన్నీ అయ్యేదెప్పుడు.. ఆలయంఅభివృద్ధి చెందేదెప్పుడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం గోదావరి పుష్కరాల నాటికై నా ఆలయ అభివృద్ధి పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
భద్రాచల రామాలయ అభివృద్ధికి ఆటంకం!
స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించని రెండు కుటుంబాలు
భూ సేకరణ పూర్తయితేనే పనులు ప్రారంభం