
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టా న్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
కూచిపూడి నృత్యంలో చిన్నారి ప్రతిభ
ఖమ్మంరూరల్ : మండలంలోని సూర్యనగర్‌కు చెందిన చిన్నారి గండికోట భువనచంద్రిక కూచిపూడి నృత్యంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొన్న భువన.. మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో బాసర సరస్వతి అమ్మవారి అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా భువనను పలువురు అభినందించారు.
మధిర – విజయవాడ బస్సు సర్వీస్ షురూ
మధిర: మధిర డిపో పరిధిలోని జమలాపురం నుంచి మైలవరం మీదుగా విజయవాడకు నూతన బస్సు సర్వీస్‌ను సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ డి.శంకర్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం మూడు ట్రిప్పులు సర్వీస్ ఉంటుందని, మధిర నుంచి ఉదయం 6, 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతుందని, విజయవాడ నుంచి ఉదయం 8.30,మధ్యాహ్నం 1.30, సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరుతుందని వివరించారు.
బైక్‌ను ఢీకొట్టిన కారు
చింతకాని: మండలంలోని నాగులవంచ సమీపంలో ఆదివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ఏపీలోని చిల్లకల్లు, చిట్యాల దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారి వెంకటేశన్‌కు గాయాలయ్యాయి. వెంకటేశన్ ద్విచక్ర వాహనంపై ఖమ్మం వస్తుండగా నాగులవంచ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన ఆయన్ను 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గంజాయి పట్టివేత
ఖమ్మంక్రైం: నగరంలోని త్రీటౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మోహన్‌బాబు కథనం ప్రకారం.. అగ్రహారం కాలనీకి చెందిన రాయల భోగి అలియాస్ యోగి, దానవాయిగూడెం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లల్లో నివసించే బానోత్ సాయి కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మోతీనగర్ పార్కు వద్ద పోలీసులు తారపడ్డారు. దీంతో వారు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకుని, తనిఖీ చేయగా 200 గ్రాముల గంజాయి దొరికింది. వారిద్దరు అగ్రహారం కాలనీలో ఉండే నాగేంద్రబాబు (పండుఝ) నుంచి కొన్ని రోజుల కిందట 300 గ్రాముల గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన