
కార్మికుల రేట్లపై చర్చలు వాయిదా
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్మికుల రేట్లు సవరించేందుకు శనివారం పాలకవర్గం, అధికారులు, సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది. మార్కెట్‌లో పనిచేసే హమాలీలు, రెల్లుడు కూలీలు, స్వీపర్లు, దడవాయిలు తదితరులకు రెండేళ్లకోసారి కూలీ రేట్లు పెంచ డం ఆనవాయితీ. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు 25 శాతం పెంచాలని కొన్నాళ్ల క్రితం లేఖ ఇచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు శనివా రం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు అధ్యక్షతన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పాటు దిగుమతి శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈమేరకు కార్మిక సంఘాల ప్రతినిధులు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా తమకు కూలీ ధరలు పెంచాలని కోరగా, రైతు సంఘాల ప్రతినిధులు మాత్రం ఈ ఏడాది పంటల ధరలు ఆశాజనకంగా లేనందున మరికొంత కాలం వాయిదా వేయాలన్నారు. దీంతో వారం తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలనే భావనకు రావడంతో రేట్ల పెంపు వాయిదా పడింది. మార్కెట్ ఉపాధ్యక్షులు తల్లాడ రమేష్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ.అలీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని కృష్ణారావు, మెంతుల శ్రీశైలంతో పాటు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ముత్యం ఉప్పల్‌రావు, దొండపాటి రమేష్, వేణు, మీరా, లక్ష్మీనారాయణ, మేకల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.