
అధిక ఫీజులు, పుస్తకాల అమ్మకంపై ఏఐఎస్‌ఎఫ్ ఆందోళన
ఖమ్మం మామిళ్లగూడెం: అధిక ఫీజు వసూళ్లు, అక్రమంగా పుస్తకాల అమ్మకంపై ప్రశ్నించినందుకు నారాయణ విద్యాసంస్థల బాధ్యులు తమపై దాడి చేశారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ఆరోపించారు. ఖమ్మం జమ్మిబండ రోడ్డులోని నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజు వసూలు చేస్తున్నారని, స్టేషనరీ పేరుతో పుస్తకాలు అమ్ముతున్నారంటూ శనివారం ఆందోళనకు చేశామని పేర్కొన్నారు. ఈమేరకు ప్రిన్సిపాల్, సిబ్బంది దూషిస్తూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులు చేరుకుని తమ నాయకులను అదుపులోకి తీసుకున్నారన్నారు. నారాయణ విద్యాసంస్థల్లోని గోదాంను విద్యాశాఖ అధికారులు సీజ్ చేసినా దొడ్డిదారిలో పుస్తకాలు అమ్ముతుండడాన్ని ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు. కాగా, నారాయణ పాఠశాలలో ప్రైమరీ సెక్షన్‌కు అనుమతి లేకున్నా, చట్టాలను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు లోకేష్, షేక్ నాగుల్‌మీరా, మధు, కౌశిక్, మనోజ్, వినయ్, గౌతమ్, అఖిల్, నాగరాజు, నరేష్, ప్రతాపు, గోపి, రాజేష్ పాల్గొన్నారు.