
ప్రాణదాతగా మాధాపురం వాసి
ముదిగొండ: మండలంలో మాధాపురానికి చెందిన భువనగిరి లక్ష్మీనారాయణ(44) ఈనెల 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా చికిత్స చేయించే క్రమాన బ్రెయిన్‌డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించడంతో మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 16న లక్ష్మీనారాయణ టెట్ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆటోలో మాదాపురం నుంచి ఖమ్మం వెళ్తుండగా రహదారి పక్కన ఉన్న చెట్టు ఆటోపై పడింది. దీంతో లక్ష్మీనారాయణ తలకు గాయాలు కాగా ఖమ్మంలో చికిత్స చేయించినా ఫలితం లేకపోగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ శనివారం ఉదయం ఆయన గుండె, నేత్రాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలను సేకరించిన వైద్యులు అవసరమైన వారికి అమర్చారు. దీంతో లక్ష్మీనారాయణ మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసినట్లయింది. ఈమేరకు ఆయన మృతదేహం వద్ద గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు నివాళుర్పించి, అవయవదానానికి అంగీకరించిన కుటుంబీకులను అభినందించారు.
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి
అవయవాల దానం