
విపత్తుల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం సహకారనగర్: విపత్తుల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ గత ఏడాది వచ్చిన వరదలను పరిగణనలోకి తీసుకుని ఈసారి మూడు నెలల పాటు జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఉంటాయని తెలిపారు. తద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలకు వీలవుతుందని చెప్పారు. ఈమేరకు అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక పునరావాస కేంద్రాలను గుర్తించాలని, అవస రమైన సామగ్రి సమకూర్చుకోవాలని సూచించారు. డీఆర్వో ఏ.పద్మశ్రీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం కమాండర్ ఎస్.గౌతమ్, ఉద్యోగులు మద్దిలేటి, జగదీష్, సురేష్‌కుమార్, రియాజుద్దీన్, జనార్దన్ పాల్గొన్నారు.
ఏఐతో సులువుగా పనులు
అధికారులు విధినిర్వహణలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగిస్తూ సులువుగా పనులు చేసేలా త్వరలోనే వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన విధి నిర్వహణపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఫైళ్లు పరిష్కరించాలని, ఉద్యోగులు బృందంగా పని చేస్తేనే ఫలితాలు వస్తాయని తెలిపారు. అందరూ సమయపాలన పాటించాలని, గైర్హాజరైతే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆపై కలెక్టరేట్ నిర్వహణ, ప్రొటోకాల్ అంశాలపై సూచనలు చేశారు.