
దర్శనం, ఆర్జిత సేవలకు ఇక ఈ–టికెట్లు
● ట్రయల్ రన్ నిర్వహించిన దేవస్థానం ఈఓ ● ఇప్పటికే రామాలయంలో డిజిటల్ సేవలు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో డిజిటల్ సేవలు భక్తులకు మరింత చేరువ అవుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో డిజిటల్ సేవలు అందుతుండగా తాజాగా స్వామివారి దర్శన, ఆర్జిత టికెట్లు పొందేందుకు మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం ఆలయంలో ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు మిషన్లను ఫెడరల్ బ్యాంక్ అధికారులు ఉచితంగా అందించగా, పడమెర మెట్ల వైపు ఒకటి, లడ్డూ కౌంటర్ల వద్ద రెండు మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. యంత్రాలతో భక్తుల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని మిషన్లను దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు బ్యాంకర్లతో దేవస్థానం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.
భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేర్మేషన్ యాప్..
రామాలయ సమస్త సమాచారం లభించేలా భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్(బీటీఐ) యాప్ రూపొందించారు. తెలంగాణలోనే తొలిసారిగా యాప్‌ను రూపొందించి భక్తులకు చేరువైన దేవస్థానంగా రామాలయం నిలిచింది. ఇందులో ఆలయానికి సంబంధించిన 22 రకాల సేవల వివరాలు లభ్యమవుతాయి. సేవలు పొందే ప్రదేశాలతో గూగుల్ మ్యాప్‌ను అనుసంధానించారు. భద్రాచలంతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఉపాలయాలు, సందర్శనీయ స్థలాల వివరాలు కూడా పొందుపర్చారు.
త్వరలో అకౌంట్లు సైతం..
త్వరలో అకౌంటింగ్ సెక్షన్‌ను సైతం డిజిటల్‌గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రికార్డుల నిర్వహణలో ఉద్యోగుల చేసే తప్పులకు ఆడిటింగ్ సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రికార్డులను కంప్యూటరైజ్డ్ చేయనున్నారు. దీంతో ఉద్యోగులకు పని ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఈఓ రమాదేవి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. మరో నెల రోజుల్లో రికార్డులు సైతం కంప్యూటరైజ్డ్ చేసే అవకాశం ఉంది.
డిజిటల్‌మయంగా రామాలయం
రామాలయం డిజిటల్‌మయంగా మారుతోంది. తొలుత దేవస్థాన వెబ్‌సైట్ ఆధునికీకరించారు. లడ్డూ కౌంటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్ చేశారు. నిత్యన్నదానం, గోశాలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు నమోదుతో పాటు దాతలకు ఆన్‌లైన్ రశీదులు అందజేస్తున్నారు. స్వామివారి వస్త్రాల విక్రయాలకు బార్‌కోడ్ రూపొందించారు. ప్రొటోకాల్ దర్శనానికి వచ్చే వారికి స్కాన్‌తో ఫొటో తీసి ఎంట్రీ టికెట్ అందజేస్తున్నారు. అన్నదానానికీ ఈ–టోకెన్ ఇస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో డిజిటల్ సేవలను విస్తరింపజేశారు.
సులభంగా సేవలు పొందేలా..
ఒక్కొక్కటిగా భక్తులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. భక్తులకు సమయం ఆదా, సులభరీతిలో సేవలు అందేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. యాప్, ఆన్‌ల్‌లైన్‌లో సేవలతోపాటు తాజాగా కియోష్కి మిషన్లు ద్వారా దర్శన, ప్రసాద టికెట్లు విక్రయించే చర్యలు చేపట్టనున్నాం. వీటిపై ట్రయల్‌రన్ నిర్వహించాం.
– ఎల్.రమాదేవి, రామాలయ ఈఓ