
రాజకీయాల్లో యువత పాత్ర కీలకం
ఖమ్మంమయూరిసెంటర్: రాజకీయాల్లో యువత పాత్ర ఎంతో కీలకమని గుర్తించి సమాజ మార్పునకు ముందుకు రావాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్‌రెడ్డి సూచించారు. ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయికుమార్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉందని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అంతేకాక ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని తెలిపారు. ఇదే సమయాన యువతకు అత్యధిక సీట్లు ఇచ్చేలా నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికి పదవులు తప్పక వస్తాయని తెలిపారు. తొలుత మయూరి సెంటర్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, కార్యదర్శి జెర్రిపోతుల అంజనీకుమార్, నాయకులు యడ్లపల్లి సంతోష్, ఖలీల్ పాషా, బెజ్జం గంగాధర్, బానోత్ కోటేష్ పాల్గొన్నారు. కాగా, సభ్యత్వ నమోదులో ప్రతిభ కనబరిచిన యూత్ కాంగ్రెస్ నాయకుడు కె.క్రాంతికుమార్‌ను శివచరణ్‌రెడ్డి సత్కరించారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
శివచరణ్ రెడ్డి