
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
కొణిజర్ల: పత్తి చేనులో పని కోసం నడిచి వెళ్లున్న ఓ మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన మండలంలోని తీగలబంజరలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తీగలబంజరకు చెందిన సయ్యద్ గోర్‌బీ(53) పత్తి చేనులో పనికి వెళ్తుండగా సింగరాయపాలెంకు చెందిన ఎస్.సాయికృష్ణ ద్విచక్ర వాహనంతో వెనక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కింద పడిన గోర్‌బీ మామూలుగానే లేచి ఇంట్లోకి వెళ్లింది. ఆ కాసేపటికి వాంతులు చేసుకుంటుండడంతో వైరా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గోర్‌బీకి భర్త జానీమియా, ఇద్దరు కుమార్తెలు ఉండగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సూరజ్ తెలిపారు.