
అన్యాక్రాంతం
అసైన్డ్ భూములు
ఖమ్మంమయూరిసెంటర్: అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు అసెస్‌మెంట్ నంబర్లు కేటాయించడంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. బల్లేపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 137, 138ల్లోని అసైన్డ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలను గురువారం పరిశీలించి కొలతలు, ఎంత మేర నిర్మాణాలు చేపట్టారనే వివరాలు సేకరించారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తహసీల్దార్‌తో కూడిన బృందం అసైన్డ్ స్థలాల్లో పరిశీలించగా కేఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు, టౌన్‌ప్లానింగ్ అధికారి, ఇతర సిబ్బంది పర్యవేక్షణలో వివరాలు సేకరించారు. అలాగే, రెవెన్యూ శాఖ ఖమ్మం అర్బన్ కార్యాలయ ఆర్‌ఐ, సర్వేయర్ పంచనామా చేశారు. అనంతరం జయనగర్ కాలనీ రోడ్డు నంబర్ 10లో ఓ భవనం, బాలపేటలోని ఇంకో భవనాన్ని కూడా పరిశీలించి కొలతలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, బాలపేటలోని భవన యజమానులు లేకపోవడంతో తిరిగి కేఎంసీ కార్యాలయానికిచేరుకొని అసెస్‌మెంట్ల రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. 2021 నుంచి 2023 సెప్టెంబర్ వరకు రెవెన్యూ విభాగం నుంచి కేటాయించిన అసెస్‌మెంట్ల నంబర్లకు సంబంధించిన రికార్డులను తమకు అందజేయాలని కేఎంసీ అధికారులను విజిలెన్స్ అధికారులు కోరినట్లు సమాచారం.
రికార్డులు పరిశీలించకుండానే..
బల్లేపల్లి సర్వే నంబర్ 137, 138ల్లోని అసైన్డ్ భూములను ప్రభుత్వం కొందరు గిరిజనులకు కేటాయించి పట్టాలు అందజేసింది. ఆ భూమిలో వారు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందాలే తప్ప నిర్మాణా లు చేపట్టడానికి వీలులేదు. అయితే, కొందరి నుంచి భూమి కొనుగోలు చేసిన ఓ వ్యక్తి అనుమతి లేకుండానే నిర్మాణం చేపట్టాడు. ఇదే మాదిరి ఇంకొందరు కూడా నిర్మాణాలు చేశారని సమాచారం. అయితే, అసైన్డ్ భూమిలో నిర్మాణాలను కేఎంసీ అధికారులు అడ్డుకోకపోగా.. రెవెన్యూ విభాగం నుంచి అసెస్ మెంట్ నంబర్లు కేటాయించడం గమనార్హం. తద్వారా ఆ నంబర్ ఆధారంగా సదరు వ్యక్తి భూమి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రత్యేక విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా కనెక్షన్ తీసుకున్నాడు. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా ఏ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించకపోగా అనుమతులపై ఆరా తీయకపోవడం గమనార్హం. ఈనేపథ్యాన అసైన్డ్ స్థలంలో నిర్మాణాలు, అసెస్‌మెంట్ నంబర్లు కేటా యింపు అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ ప్రారంభించారు.
ఆ నంబర్లు రద్దు
అసైన్డ్ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలకు అసెస్‌మెంట్ నంబర్లు కేటాయించడం, వీటి రిజిస్ట్రేషన్లు జరగడంపై ఆరోపణలు రావడంతో కేఎంసీ అధికారులు నంబర్లను రద్దు చేశారు. కానీ అనుమతి లేని నిర్మాణాలు, నిర్మాణదారులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అసైన్డ్ భూముల్లో చేపట్టిన నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఎలా ఇచ్చారనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా, ఈ విషయంలో కేఎంసీ టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగ అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతి లేని నిర్మాణాలకు
అసెస్‌మెంట్ నంబర్లు
ఫిర్యాదులతో నంబర్లు రద్దు చేసి చేతులు దులుపుకున్న కేఎంసీ అధికారులు
విచారణకు రంగంలోకి దిగిన విజిలెన్స్
నాటి రికార్డుల పరిశీలన
ఖమ్మం నగర పాలకసంస్థ పరిధిలో అనుమతి లేకుండా చేపట్టిన వందలాది నిర్మాణాలకు రెవెన్యూ విభాగ అధికారులు అక్రమంగా అసెస్‌మెంట్(ఇంటి నంబర్లు) కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై అందిన ఫిర్యాదులతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. కేవలం బల్లేపల్లి ప్రాంత నిర్మాణాలే కాక అసెస్‌మెంట్ నంబర్లు కేటాయింపుపై పూర్తిస్థాయి విచారణకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా 2021 ఏడాది నుంచి 2023 సెప్టెంబర్ వరకు అసెస్‌మెంట్ల నంబర్ల కేటాయింపు రికార్డుల పరిశీలనకు సిద్ధమైనట్లు తెలిసింది. ఆతర్వాత క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

అన్యాక్రాంతం