
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
సత్తుపల్లిటౌన్/పెనుబల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక పద్ధతుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ తెలిపారు. సత్తుపల్లి మండలం సిద్ధారం యూపీఎస్‌లో ఏఐ బోధన, సత్తుపల్లి పాత యూపీఎస్‌లో పీఎంశ్రీ అమలును గురువారం పరిశీలించిన ఆయన జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు బిగ్‌హెల్ప్ సంస్థ సమకూర్చిన బ్యాగ్‌లు పంపిణీ చేసి మొక్కలు నాటారు. అలాగే, గత ఏడాది పదో తరగతిలో నూరు శాతం ఫలితాలు సాధించడంపై జెడ్పీహెచ్‌ఎస్ హెచ్‌ఎం శైలకుమారి, ఉపాధ్యాయులను డీఈఓ అభినందించారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ నక్కా రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అలాగే, పెనుబల్లి మండలం వీఎం బంజర్, కుప్పెనకుంట్ల జెడ్పీహెచ్‌ఎస్‌ల్లో బడిబాట ముగింపు సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్ డేలో డీఈఓ పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థులను విద్యాసంవత్సరం మొదట్లోనే గుర్తించి వారి సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంఈఓ ఎస్.సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.