
క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి పకడ్బందీగా పోటీలు
నేలకొండపల్లి: ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి మండలాల వారీగా ఎంపిక పోటీలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని విద్యాశాఖ సీఎంఓ, ఫిట్ ఇండియా జిల్లా నోడల్ అధికారి రాజశేఖర్ తెలిపారు. నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం పాఠశాలలను గురువారం తనిఖీ చేసిన ఆయన కంప్యూటర్ ఆధారిత బోధనపై ఆరా తీశారు. అలాగే, విద్యార్థుల ప్రగతి, సామర్థ్యాలను పరీక్షించాక దివ్యాంగుల పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సీఎంఓ మాట్లాడుతూ రాజేశ్వరపురం భవిత కేంద్రాన్ని నేలకొండపల్లిలోని దివ్యాంగుల పునరావాస కేంద్రంలో విలీనం చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఫిజియోథెరపీ ద్వారా వారిని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. కాగా, స్పోర్ట్ స్కూళ్లలో ప్రవేశానికి ఈనెల 21 వరకు మండలస్థాయి పోటీలు పూర్తిచేసి, 22న ఖమ్మంలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తామని, అక్కడ ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. కాగా, అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.