
బిందు సేద్యానికి ప్రోత్సాహం
● ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు చేయూత ● జిల్లాలో 14,500 ఎకరాలకు డ్రిప్ యూనిట్ల మంజూరు ● వార్షిక ప్రణాళికలో రూ.408 కోట్లు కేటాయింపు
కల్లూరురూరల్: ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా బిందు సేద్యానికి సహకరించేలా సబ్సిడీలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు 2025–26 సంవత్సరానికి సంబంధించి రూ.408 కోట్ల నిధులు కేటాయించింది. ఉద్యానవన పంటలైన ఆయిల్‌పామ్, మామిడి, నిమ్మ, జామ, మిర్చి, పత్తి, అరటి, అంజీర, బొప్పాయి, అవకాడో, హైబ్రిడ్ కూరగాయలు, పూలమొక్కలు తదితర పంటలను అధిక శాతం సాగు చేసేలా రైతులను ఉద్యానవన శాఖ ప్రోత్సహిస్తోంది. ఉద్యాన సాగును ప్రోత్సహించడమే కాక తక్కువ ఖర్చుతో లాభాలు గడించేలా డ్రిప్ యూనిట్లు మంజూరు చేయనున్నారు.
రాయితీపై పరికరాలు
బిందుసేద్యం యూనిట్ల మంజూరులో భాగంగా రైతు లకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. షెడ్యూల్ కులాలు, తెగల రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు మంజూరు చేస్తారు. అలాగే, సన్న, చిన్నకారు, వెనుకబడిన తరగతుల రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ అందుతుంది. డ్రిప్ సేద్యానికి సంబంధించిన పరికరాలు, సామగ్రి కావాల్సిన రైతులు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే కొందరు రైతులకు ఈ పథకం ద్వారా యూనిట్లు మంజూరు చేశారు.
తొలి విడతగా రూ.16.17 కోట్లు
జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం) పరికరాల కొనుగోలుకు తొలి దశలో రూ.16.17 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో మొదటి విడతగా 1,710 ఎకరాల్లో బిందు సేద్యం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేశాక, అధికారులు డ్రిప్ మిషనరీ, పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయిస్తారు. నిధుల మంజూరు మొదలు పరికరాల ఎంపిక, బిగించే వరకు అధికారులు పర్యవేక్షించనున్నారు. అంతేకాక పరికరాల సరఫరాకు జిల్లాల వారీగా కంపెనీలను సైతం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నేపథ్యాన వారే కొన్నేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూస్తూ రైతులకు అండగా నిలుస్తారు.
‘రాష్ట్రీయ కృషి యోజన’ద్వారా..
రాష్ట్రీయ కృషి యోజన పథకం కింద రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోంది. పండ్ల తోటలకు డ్రిప్‌తో పాటు కూరగాయల తోటల్లో పందిళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. అలాగే, రైతులు వెదురు సాగు చేపట్టవచ్చు. –జి.నగేశ్, ఉద్యానవనశాఖ అధికారి,
కల్లూరు డివిజన్

బిందు సేద్యానికి ప్రోత్సాహం