
12 ట్రాలీలు.. 39 పశువులు
ఖమ్మంఅర్బన్: కామేపల్లి మండలం పండితాపురం సంతలో కొనుగోలు చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాలు, ఇతర జిల్లాలకు తరలిస్తున్న పశువులను ఖమ్మంఅర్బన్ (ఖానాపురం హవేలీ) పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పలువురు రైతులు 12 మినీ ట్రాలీల్లో 39కిపైగా పశువులను తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. వ్యవసాయ అవసరాల కోసం ఈ పశువులను కొనుగోలు చేసినట్లు చెప్పడమే కాక అన్ని పత్రాలు చూపించారు. అయినప్పటికీ ఒక్కో వాహనంలో రెండుకు మించి పశువులను తీసుకెళ్లొద్దనే నిబంధన ఉల్లంఘించారని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఆపై పశువులను సమీప గోశాలలకు తరలించి వాహనదారులు, కొనుగోలుదారులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసుల వివరణ కోసం యత్నించగా స్పందించలేదు. కాగా, వ్యవసాయ పనుల కోసం ఆవులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్న రైతులను పోలీసులు వేధించడం గర్హనీయమని మాస్‌లైన్ జిల్లా నాయకుడు ఆవుల అశోక్ పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆయన రైతులను కలిసి మాట్లాడారు. కొందరు ఆకతాయిలు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తే విచారణ లేకుండా పోలీసులు వాహనాలను సీజ్ చేయడం సరికాదని తెలిపారు.
చెక్ డ్యాంలో పడి వ్యక్తి మృతి
జూలూరుపాడు: మండలంలోని వెంగన్నపాలెం వైకుంఠధామం సమీపంలోని చెక్ డ్యాంలో ప్రమాదవశాత్తు పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెంగల చిన్న వెంకయ్య(55) మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లేదు. బుధవారం చెక్ డ్యాం నీటిలో మృతదేహం లభ్యమైంది. అనారోగ్యం, మానస్థితి బాగాలేక బాధపడుతున్న చిన్న వెంకయ్య బహిర్భూమికి వెళ్లి చెక్ డ్యాంలో పడి మృతి చెంది ఉండవచ్చునని కుటుంబసభ్యులు పేర్కొన్నారు.
అక్రమంగా
తరలిస్తున్నారని స్వాధీనం

12 ట్రాలీలు.. 39 పశువులు