
దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు
వైరా: వివిధ కారణాలతో దివ్యాంగులుగా మారిన ఉమ్మడి జిల్లాలోని ఆరుగురికి వైరా ఎస్‌ఐ పుష్పాల రామారావు చొరవతో కృత్రిమ కాళ్లు సమకూరాయి. ఏపీలోని మంగళగిరి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యాన ఆరుగురికి మంగళగిరిలోని రోటరీక్లబ్ కార్యాలయంలో కృతిమ కాళ్లు అమర్చారు. తక్కువ బరువు కలిగిన వీటితో దివ్యాంగులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు సోమవారం వైరా ఎస్‌ఐ రామారావు, రోటరీ క్లబ్ బాధ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
జనరల్ ఆస్పత్రి కిటకిట
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సోమవారం కిటకిటలాడింది. ఉదయం 8గంటల నుంచే పరీక్షలు, చికిత్స కోసం వచ్చిన పలువురు ఓపీ చీటీల కోసం బారులు దీరారు. మారిన వాతావరణ పరిస్థితుల్లో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారు ఆస్పత్రికి వచ్చారు. అయితే, ఓపీ చీటీల కోసం గంటల తరబడి వేచి ఉండడం, ఆపై వైద్యుల వద్ద పరీక్ష చేయించుకోవడానికి సమయం పట్టడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇక నిర్దేశిత పరీక్షలు చేయించుకుని నివేదికలతో వచ్చే సరికి ఓపీలో వైద్యులు ఉండకపోవడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మరో వైద్యుడి వద్దకు వెళ్లి మందులు రాయించుకోవాల్సి వచ్చిందని వాపోయారు.
రైతుల ప్రయోజనాల కోసం చట్టం ఉండాలి
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విత్తన చట్టం అన్నదాతల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఏఐయూకేఎస్(అఖిల భారత ఐక్య రైతు సంఘం) రాష్ట్ర కోశాధికారి ఆవుల వెంకటేశ్వర్లు, నాయకుడు గుర్రం అచ్చయ్య అన్నారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించకుండా ప్రైవేట్ విత్తన కంపెనీలు, డీలర్లతో సమావేశమై చట్టాన్ని తీసుకొస్తే రైతులకు ప్రయోజనం ఉండదన్నారరు. ఈమేరకు రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, రైతుల నుంచి సూచనలు స్వీకరించాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు కోలేటి నాగేశ్వరరావు, కమ్మకోమటి నాగేశ్వరరావు, బీరెల్లి లాజర్, గుగులోతు తేజ, పాశం అప్పారావు, ఒగ్గు నాగిరెడ్డి, కుర్ర వెంకన్న, కేలోతు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు

దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు