
ప్రైవేట్ విద్యాసంస్థల గోదాం సీజ్
ఖమ్మం మామిళ్లగూడెం: ఫీజులు, పుస్తకాల పేరిట ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో తల్లిదండ్రుల నుంచి విచ్చవిడిగా వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు ఇటికాల రామకృష్ణ విమర్శించారు. ఈమేరకు నాయకులు సోమవారం ఖమ్మంలోని నారాయణ విద్యాసంస్థల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో అర్బన్ ఎంఈఓ శైలజ తనిఖీలు చేపట్టి పాఠశాల గోదాంను సీజ్ చేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ వివిధ పేర్లతో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా అన్ని పాఠశాలల్లో తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, నాయకులు షేక్ నాగుల్‌మీరా, మధు, మనోజ్, గోపి, పవన్, వినయ్, లక్ష్మణ్, గౌతమ్, సురేష్, నాగరాజు, ఉమ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడు మృతి
ముదిగొండ: ముదిగొండ మండలం వనంవారికిష్టాపురం సమీపాన సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడకు చెందిన పి.పున్నయ్య(70) ఆటోలో ఖమ్మం నుంచి జగ్గయ్యపేట వెళ్తున్నాడు. మార్గమధ్యలో వనంవారి కిష్టాపురం సమీపాన ఆటోను బైక్ ఢీకొనగా పున్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.