
విత్తనాలు సిద్ధం..
అందుబాటులోకి వరి, అపరాల సీడ్స్
● వరిలో బీపీటీ, కేఎన్‌ఎం సన్న రకాలు ● అపరాలలో పెసర, మినుములు రెడీ
రైతులకు అందుబాటులో..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వరిలో బీపీటీ 5204, కేఎన్‌ఎం 1638 సన్న రకాల విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని విత్తన విక్రయ కేంద్రాల్లో బీపీటీ 5204 రకం 2,943 క్వింటాళ్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 807 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. కేఎన్‌ఎం 1638 రకం ఖమ్మం జిల్లాలోని విక్రయ కేంద్రాల్లో 187 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. ఖమ్మం జిల్లాలో పెసలు ఎంజీజీ 295 రకం 10 క్వింటాళ్లు, ఎంజీజీ 385 రకం 130 క్వింటాళ్లు, మినుములు బీజీ పీయూ–31 రకం 35 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. ఇవిగాక ఖమ్మం విత్తనాభివృద్ధి సంస్థ యూనిట్‌లో బీపీటీ 5204 రకం వెయ్యి క్వింటాళ్లు, కేఎన్‌ఎం 1638 రకం 180 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయి.
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిట్ వరి, అపరాల విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. వానాకాలం సీజన్ ప్రారంభం కావటంతో తొలుత మెట్ట పంటలు, ఇదే క్రమంలో వరి సాగుకు అవసరమైన విత్తనాలను సంస్థ సిద్ధం చేసింది. ప్రభుత్వం వరిలో విదేశీ డిమాండ్ ఉన్న సన్న రకాలను ప్రోత్సహిస్తోంది. అంతేగాక సన్న రకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇస్తోంది. దీంతో రైతులు కూడా వరి సాగులో సన్న రకాలకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా నీటి వనరులు, నేలల రకాలు, వ్యవసాయ శాఖల ఇండెంట్ల ఆధా రంగా వరిలో సన్న రకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బీపీటీ 5204 రకంతో పాటు కేఎన్‌ఎం 1638 రకాన్ని సిద్ధం చేశారు. ఇక మెట్ట పంటలుగా సాగు చేసే పెసర, మినుము విత్తనాలను కూడా సంస్థ అందుబాటులో ఉంచింది. విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్), ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు.
షరతులతో కూడిన రాయితీ
వరి విత్తనాలకు విత్తనాభివృద్ధి సంస్థ ఓ ఆఫర్ ప్రకటించింది. ఖమ్మం విత్తనాభివృద్ధి సంస్థ యూనిట్ కార్యాలయం (గోదాం) నుంచి రైతులు నేరుగా విత్తనాలను కొనుగోలు చేస్తే వారికి విత్తన ధరలో 6 శాతం రాయితీ ప్రకటించింది. అంతేగాక రైతులు సమూహంగా ఏర్పడి 2 టన్నుల విత్తనాలను ఆర్డర్ చేస్తే దానికి కూడా 6 శాతం డిస్కౌంట్ కల్పించారు. ఎలాంటి రవాణా చార్జీలు లేకుండా ఆయా గ్రామాలకు సంస్థ విత్తనాలను రవాణా చేసే సౌకర్యం కల్పించింది.
విత్తన ధరలు (రూ.లలో)
వరి కిలోలు రైతు ధర
బీపీటీ 5204 25 950.00
కేఎన్‌ఎం 1638 25 950.00
పెసలు ఎంజీజీ–295 4 506.00
పెసలు ఎంజీజీ–385 4 506.00
మినుములు పీయూ–31 4 463.00
డిమాండ్ ఆధారంగా విత్తనాలు
వానలు కురుస్తున్న వేళ విత్తన సీజన్ ప్రారంభమైంది. రైతులు సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రస్తుతం వరిలో రెండు సన్న రకాల విత్తనాలు, పెసరలో రెండు రకాలు, ఇనుములో ఒక రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాం. రైతుల వినియోగాన్ని బట్టి అందుబాటులో ఉంచుతాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని షరుతుల ఆధారంగా వరి విత్తనాలకు డిస్కౌంట్ ఇస్తున్నాం. అంతేగాక విత్తన విక్రయాలకు డీలర్ల నుంచి దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నాం. వివరాలకు విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
–ఎన్.భిక్షం, ప్రాంతీయ మేనేజర్,
విత్తనాభివృద్ధి సంస్థ

విత్తనాలు సిద్ధం..

విత్తనాలు సిద్ధం..