
మున్నేరు పనులు ముందుకు సాగేనా..?
● వరద నియంత్రణకు రిటైనింగ్ వాల్ నిర్మాణం ● ఖమ్మం వైపు భూ సేకరణకు పలువురు ససేమిరా.. ● వర్షాకాలం నేపథ్యంలో జాప్యం కానున్న పనులు
ఖమ్మం అర్బన్: మున్నేరు నదికి ఇరువైపులా వరదల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ఖమ్మం నగర పరిధిలో భూసేకరణ సమస్యతో అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు రూ. 690 కోట్ల అంచనాతో సుమారు 16 కి.మీ.కు పైగా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో ఖమ్మం రూరల్ మండలం వైపు సుమారు రూ. 150 కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తి కాగా, ఖమ్మం నగరం వైపు భూసేకరణ సమస్యలతో పనులు నిలిచిపోయాయి. నగర పరిధిలో ఎనిమిది కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 113.27 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 38.18 ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. మిగిలిన 81.08 ఎకరాల్లో ప్రైవేట్ భూములు, ప్లాట్లు ఉన్నాయి.
రైతుల నిరాకరణ..
ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరిస్తుండగా, ఇచ్చే నష్ట పరిహారం సరిపోవడం లేదని కొంతమంది రైతులు, భూమికి బదులు భూమి ఇచ్చి న్యాయం చేయాలని మరి కొందరు కోర్టులను ఆశ్రయించారు. అయితే భూ సేకరణకు ముందే రైతులను ఒప్పించాలని కోర్టులు ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.
ప్రాంతాలవారీగా భూసేకరణ ఇలా..
దానవాయిగూడెం పరిధిలో 34 ఎకరాల్లో 22 ఎకరాలు ఎన్నెస్పీ భూములు కాగా, 11 ఎకరాలు ప్రైవేట్ భూములు ఉన్నాయి. ఇందులో ఆరుగురు రైతులు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు.
●మల్లెమడుగు పరిధిలో 14 ఎకరాల 29 గుంటల భూమి అవసరం కాగా, ఏడుగురు రైతులు ఇంకా ఒప్పుకోలేదు.
●బుర్హాన్‌పురం పరిధిలో 22 ఎకరాల్లో 11 కుంటలు ప్రభుత్వ భూమి ఉంది. మరో 5 ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే ఒప్పుకోగా, మిగిలిన రైతులు ఇంకా అంగీకారం తెలపలేదు.
●ఖమ్మం అర్బన్ పరిధిలో 42 ఎకరాల 4 గుంటల భూముల్లో 9 ఎకరాల 18గుంటలు మాత్రమే ప్రభు త్వ భూమి ఉంది. మిగతా 32 ఎకరాల 24 కుంట ల్లో పదెకరాలకు చెందిన రైతులు, కొంతమంది ప్లాట్ల యజమానులు ఇవ్వడానికి ముందుకొచ్చారు.
అంగీకారాలు తక్కువ..
నగర పరిధిలో 288 ప్లాట్లు ప్రాజెక్ట్ నిర్మాణ పరిధిలో ఉండగా ఇప్పటివరకు 45 మంది మాత్రమే భూమి ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు అధికారులు చెపుతున్నారు. బుర్హాన్‌పురంలో 51 ప్లాట్లు ప్రభావితమవుతుండగా 12 మంది మాత్రమే అంగీకరించారు. దీంతో పనులు ముందుకు సాగడం కష్టంగా మారింది.
పనులు నిలిపేసే దిశగా..
వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో తాత్కాలికంగా భూసేకరణ, నిర్మాణ పనులు నిలిపేసేలా అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం నగరం వైపు ఒక కిలోమీటర్ పరిధిలో 250 మీటర్లకు పైగా వాల్ నిర్మాణం పూర్తయినట్టు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఒప్పందాలు పూర్తయ్యే వరకు మిగిలిన పనులకు జాప్యం తప్పదని తెలుస్తోంది.