
స్తంభం.. వాడితే పన్ను ఖాయం
సంయుక్తంగా సర్వేకు శ్రీకారం
ప్రైవేట్ వ్యక్తులు విద్యుత్ స్తంభం వినియోగించుకుంటే గ్రామాల్లోనైతే రూ.15, పట్టణాల్లో రూ.20 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం చాన్నాళ్లుగా అమల్లో ఉంది. కానీ విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. ఈ నేపథ్యాన జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో టీవీ, ఇంటర్‌నెట్ ఆపరేటర్లు ఎన్నేసి స్తంభాలను వినియోగించుకుంటున్నారో లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఈమేరకు విద్యుత్ సిబ్బంది, ఆపరేటర్లు సంయుక్తంగా సర్వే చేస్తున్నారు. వారం, పది రోజులలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక పన్నుల వసూళ్లకు రంగంలోకి దిగనున్నారు.
నేలకొండపల్లి: విద్యుత్ స్తంభాలను వినియోగించుకుంటున్న కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల నుంచి కచ్చితంగా పన్ను వసూలు చేసేలా విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. గతంలోనూ ఈ పన్ను విధానం అమల్లో ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే, స్తంభాలకు గజిబిజిగా వైర్లు ఉండడంతో ఏదైనా మరమ్మతు అవసరమైనప్పుడు సిబ్బంది ఎక్కడం కష్టమవుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రతీ స్తంభాన్ని పరిశీలించి వినియోగించుకున్న వారి పన్ను వసూలుకు నిర్ణయించింది.
స్తంభాలపై కుప్పలు కుప్పలుగా
పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ స్తంభాలకు వైర్లు కుప్పలుగా ఉంటున్నాయి. కేబుల్ టీవీ, ఇంటర్‌నెట్ కేబుళ్లతో పాటు విద్యుత్ తీగలు అన్ని కలిసిపోయి ఉంటాయి. ఈమేరకు ఆపరేటర్లు పదిహేను రోజుల్లోగా వైర్లను సర్దుకోవాలని అధికారులు సూచించారు. ఆతర్వాత లెక్కలు తేల్చి పన్ను వసూలుకు నిర్ణయించారు.
ఇన్నాళ్ల మాదిరి దాటవేయడం కష్టమే పక్కాగా లెక్క తేల్చేలా జాయింట్ సర్వే
వాడితే పన్ను కట్టాల్సిందే..
జిల్లాలో విద్యుత్ స్తంభాలను వినియోగించే వారంతా పన్ను చెల్లించాల్సిందే. తొలుత గజిబిజిగా ఉన్న ఇంటర్నెట్, కేబుల్ టీవీ వైర్లను సరి చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత వారు వినియోగించుకుంటున్న స్తంభాల లెక్క తేల్చందుకు జాయింట్ సర్వే చేస్తున్నాం. ఆపై ప్రతీ నెల పన్ను వసూలు చేస్తాం.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ

స్తంభం.. వాడితే పన్ను ఖాయం