
రామాలయంలోకి దూసుకెళ్లిన లారీ
పెనుబల్లి: ఓ లారీ అదుపుతప్పి మండలంలోని లంకపల్లిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న రామాలయంలోకి దూసుకెళ్లిన ఘటన శనివారం రాత్రి జరిగింది. సత్తుపల్లి వైపు నుండి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అదుపుతప్పి ఆలయంలో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో రామాలయం దెబ్బతినగా, లారీ డ్రైవర్ శ్యామ్‌సింగ్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. దీంతో పోలీసులు చేరుకుని లారీ క్యాబిన్‌లో వారిద్దరిని బయటకు తీసి 108లో పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాద సమయంలో ఆలయంలో నిద్రిస్తున్న దివ్యాంగుడైన ఓ వ్యక్తికి సైతం గాయాలయ్యాయని ఎస్సై కె. వెంకటేష్ తెలిపారు.
ప్రేమికుల అరెస్ట్..
వర్ధన్నపేట: చైన్‌స్నాచింగ్ కేసులో ప్రేమికులను వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంకు చెందిన రామాయణం హేమలత వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చింది. ఎదురింట్లో నివాసముండే పెరంబుదూరు సజాత మెడలో బంగారు గొలుసు ఉండగా, చోరీకి నిర్ణయించుకున్న ఆమె తన ప్రియుడైన పిడియాల రాముకు సమాచారం ఇచ్చింది. ఈనెల 11న రాత్రి ఆయన ఊరి చివరి వేచి ఉండగా, హేమలత ఇంటి బయటకు వచ్చిన సుజాత మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పరుగెత్తి ప్రియుడితో కలిసి బైక్‌పై ఖమ్మం పారిపోయింది. శనివారం ఖమ్మం నుంచి వరంగల్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. ఈమేరకు పోలీసులు వారిని పట్టుకుని విచారించగా 24 గ్రాముల బంగారు మంగళసూత్రం చోరీ విషయాన్ని ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సురేశ్, రంజిత్, కల్పన, సానియా పర్హాన్, స్వాతి పాల్గొన్నారు.