
పులిసిపోయిన చట్నీ, అధిక ధరలు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర వ్యాప్తంగా ఆహార తనిఖీ అధికారులు హోటళ్లలో తనిఖీ చేస్తూ ఆహార కల్తీ, అపరిశుభ్ర వాతావరణంపై జరిమానా విధిస్తున్నా ఖమ్మంలోని కొందరి తీరు మారడం లేదు. ఈనేపథ్యాన కొత్త బస్టాండ్‌లోని ఫుడ్ కోర్టు, దుకాణాల్లో వాటర్ బాటిళ్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో పాటు వంటశాలలు అధ్వానంగా మారా యని పలువురు కేఎంసీ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారాఫిర్యాదు చేశారు. దీంతో శానిటేషన్ సూపర్‌వైజర్ సాంబయ్య, ఉద్యోగులు శుక్రవారం ఫుడ్‌కోర్టులో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్‌లో పరిశీలించగా పులిసిపోయిన చట్నీ, దోసల పిండికి తోడు అపరిశుభ్రతను చూసి చట్నీని పడబోయించారు. కాగా, వినియోగదారులు కేఎంసీ అధికారులకు సమస్యలు వివరిస్తుండగా హోటల్, దుకా ణాల నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఫుడ్‌కోర్టులో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తుండడంతో కేఎంసీ అధికారులు రూ.2వేల జరిమానా విధించారు. అయితే, కేఎంసీ అధికారులు తనిఖీ చేయడంపై తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆర్టీసీ ఉద్యోగి ఒకరు ప్రశ్నించడం గమనార్హం.
బస్టాండ్‌లోని ఫుడ్‌కోర్టులో తనిఖీ, జరిమానా