
బాత్‌రూమ్‌లో జారిపడి ఉపాధ్యాయుడు మృతి
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు బాత్‌రూమ్‌లో జారి పడడంతో మృతి చెందాడు. ఖమ్మం జిల్లా మద్దులపల్లికి చెందిన నల్లగొండ రాజేంద్ర ప్రసాద్(55) పేరూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడేళ్ల నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం బడిబాట కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్‌కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో క్వార్టర్స్‌లోనే ఉండాలని సహచరులు చెప్పి బయలుదేరారు. ఆతర్వాత హాస్టల్ ఉద్యోగులు రాజేంద్రప్రసాద్ కోసం భోజనం తీసుకురాగా బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చాక తింటానని చెప్పాడు. అయితే, చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపు తెరిచి చూడగా కింద పడి ఉన్నాడు. దీంతో పేరూరు ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఏటూరునాగారం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన బాత్‌రూమ్‌లో పడడంతో అపస్మారక స్థితికి చేరి మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌కు భార్య ప్రమీలరాణి, కుమారుడు రామ్‌కుమార్, కుమార్తె స్రవంతి ఉండగా, కుమారుడు తండ్రి మృతదేహం పడి రోదించడం కలిచివేసింది.