
అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
● ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రఘునాథపాలెం: అభివృద్ధి విషయంలో ఖమ్మం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తోందని చెప్పారు. రఘునాథపాలెం మండలంలోని కోయచలక, రేగులచలకల్లో శుక్రవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక మాట్లాడారు. జిల్లాలో అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో రైతులు వరినాట్లు వేయకముందే వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పారు. కాగా, గ్రామాల్లో రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించడమే కాక అనారోగ్యం దరి చేరకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తొలుత కోయచలక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందజేసిన మంత్రి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఏఓ డి.పుల్లయ్య, ఆర్డీఓ నరసింహారావు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఎంఈఓ రాములు, హెచ్‌ఎం శిరీష, పీఆర్ డీఈ మహేష్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్‌కుమార్‌తో పాటు చెరుకూరి పూర్ణ, యండపల్లి సత్యం, అన్నం భూషయ్య, రాంప్రసాద్, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వాంకుడోత్ దీపక్, మాధంశెట్టి హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.
కష్టపడిన వారికే పదవులు
పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక పదవులు లభిస్తాయని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ రఘునాథపాలెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం బాలాపేటలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలిస్తే నిరుత్సాహానికి గురిచేయకుండా పదవుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే స్థాయికి చేరుస్తామని, తద్వారా తనకు కూడా గౌరవం దక్కుతుందని తెలిపారు. రఘునాథపాలెం మండల అభివృద్ధికి ఇప్పటికే రూ.500 కోట్లకు నిధులు తెచ్చినందున మిగతా పదవీకాలంలో మరిన్ని నిధులు సాధిస్తానని చెప్పారు. కాగా, పలు గ్రామాల నాయకులు ఈ సమావేశంలో మాట్లాడుతూ తమకు పార్టీలో తగిన గుర్తింపులేదని, కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోగా నాయకులు అందరినీ కలుపుకోవడం లేదని, మైనార్టీలకు పార్టీ పదవుల్లో అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈసమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు, మార్కెట్, ఆత్మ కమిటీల చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లుతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, మానుకొండ రాధాకిషోర్, సాధు రమేష్‌రెడ్డి, వాంకుడోత్ దీపక్, తాతా రఘురాం, చెరుకూరి పూర్ణ, దేవ్‌సింగ్, రామూర్తి, యండపల్లి సత్యం, రెంటాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి తుమ్మల బైక్‌పై బాలసాని లక్ష్మీనారాయణను ఎక్కించుకుని నడపగా.. బైక్ నిలిపే సమయాన అదుపు తప్పుతుండడంతో నాయకులు స్పందించగా ప్రమాదం తప్పింది.