
వార్షిక రుణప్రణాళిక.. రూ.16వేల కోట్లు
● వ్యవసాయ రంగానికి అత్యధిక కేటాయింపులు ● మొత్తం రుణాల్లో రూ.50.94శాతం ఈ రంగానికే.. ● 4.98లక్షల మందికి ప్రయోజనం కలిగేలా రూపకల్పన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. రూ.16,185.12 కోట్లతో రూపొందించిన ప్రణాళిక ను జిల్లా లీడ్ బ్యాంకు శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 4,98,651 మంది బ్యాంకు ఖాతాదారులకు రుణాలు ఇవ్వనుండగా.. 50.94 శాతం రుణాలను వ్యవసాయ అవసరాలకు కేటాయించారు. అలాగే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, విద్య, గృహ, సామాజిక, పునరుత్పాదక శక్తి తదితర రంగా లకే కాక ప్రాధాన్యేతర రంగాలకు ప్రణాళికలో ప్రాధాన్యత కల్పించారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట
వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎప్పటి మాదిరిగానే ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలో పెద్దసంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నందున మొత్తం రుణాల్లో 50.94 శాతం ఈ రంగానికి కేటాయించారు. మొత్తం 4,22,519 మంది వ్యవసాయ, అనుబంధ రైతులకు రూ. 8,244.72 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధుల నుంచి రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానం ద్వారా బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి.
పారిశ్రామిక, ఇతర రంగాలకు...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 2,968.30 కోట్లు కేటాయించారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమలకు ప్రాధాన్యతగా రూ. 1,813.60 కోట్లు, చిన్న పరిశ్రమల స్థాపనకు రూ.908.60 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.246.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మొత్తం 22,428 మందికి లబ్ధి జరగనుంది. ఇక విద్య, గృహ, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, ఇతర రంగాల్లో 3,320 మందికి ప్రయోజనం కలిగేలా రూ.289.30 కోట్లు కేటాయించారు. ఇందులో విద్యా రంగానికి రూ.97 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.63.40 కోట్లు కేటాయించగా, ప్రాధాన్యేతర రంగాల్లో 50,384 మందికి ప్రయోజనం కలిగే విధంగా రూ.4,682.80 కోట్ల రుణాలు ఇచ్చేలా ప్రణాళికలో పొందుపరిచారు.
ప్రాధాన్యతల ఆధారంగా కేటాయింపులు
జిల్లాలో రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగాల వారీగా ప్రణాళిక రూపొందించాం. జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ రూపొందించిన ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకున్నాం. జిల్లాలో ప్రధాన రంగం వ్యవసాయమే కావడంతో 50 శాతానికి పైగా నిధులను కేటాయించాం. వివిధ రంగాల అభివృద్ధి, తద్వారా జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళిక అమలుచేస్తాం.
– ఏ.శ్రీనివాసరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్