
అలా వచ్చి... ఇలా వెళ్లారు!
నేలకొండపల్లి: ఫ్యాక్టరీ కారణంగా పంటలు నష్టపోతున్నామని, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఫిర్యాదు చేస్తే పంట కోతలు పూర్తయ్యాక వచ్చిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉద్యోగులు కొద్దిసేపటికే వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అప్పలనరసింహాపురంలో ఉన్న ఐరన్ ఓర్, కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా పంటలుపై దుమ్ము, దూళి చేరుతోందని, నీరు కలుషితమవుతోందని రైతులు ఈ ఏడాది ఫిబవరి 3న చెన్నె, హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రాకుండా పంట కోతలు పూర్తయ్యాక టాస్క్‌ఫోర్స్ సభ్యులు శ్రీధర్, గోపాల్, కొత్తగూడెం ఏఈ అజయ్ సోమవారం వచ్చారు. దీంతో వారి ఎదుట రైతులు ఆవేదన వెలిబుచ్చారు. పంటలు ఉన్న సమయాన వస్తే తమ ఇబ్బందులు తెలిసేవని పేర్కొన్నారు. ఇకనైనా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోకపోతే పీసీబీ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఎలాంటి హామీ ఇవ్వకుండా ఉద్యోగులు కాసేపటికే వెళ్లిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఎలగాల మీరయ్య, జిడుగు లక్ష్మీనారాయణ, బి.భాస్కర్, వెనికె రామారావు, వై.పిచ్చయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
పీసీబీ ఉద్యోగుల తీరుపై రైతుల ఆగ్రహం