
వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే..
ఖమ్మంక్రైం: ప్రభుత్వ సూచనల మేరకు రవాణా శాఖ ఉద్యోగులు వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్‌చార్జ్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం స్పష్టం చేశారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇన్‌చార్జ్ డీటీఓ వెంకటరమణ స్వాగతం పలకగా, ఉద్యోగులతో సమావేశమై సూచనలు చేశారు. పన్నులు చెల్లించని వాహనాలను గుర్తించి జరిమానా విధించాలని సూచించారు. అలాగే, సీజ్ చేసిన వాహనాలు ఏళ్లుగా తీసుకెళ్లకపోతే స్క్రాప్‌కు తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఓ సుధాకర్, ఏఎంవీఐ స్వర్ణలత, ఉద్యోగులు పాల్గొన్నారు.
నెట్‌బాల్ టోర్నీలో
జైత్రయాత్ర
ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ నెట్‌బాల్ పోటీల్లో ఖమ్మం క్రీడాకారులు ప్రతిభ చాటారు. సంప్రదాయ నెట్‌బాల్ విభాగంలో బాలుర జట్టు తృతీయస్థానం సాధించింది. అలాగే, సబ్ జూనియర్ విభాగంలో జిల్లా బాలబాలికల జట్లు ద్వితీయస్థానంలో నిలిచాయి. అంతేకాక ఈనెల 25నుంచి మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టులో జిల్లా బాలబాలికలు పది మంది స్థానం దక్కించుకున్నారు. బాలురలో సాన్‌హిత్, హసిత్, సాకేత్, సంజయ్, నేహాల్, సూర్య ఎంపిక కాగా, బాలికల జట్టుకు అవంతిక, హరిణి, రిత్వికసహస్ర, సింధు ఎంపికయ్యారు. ఈసందర్భంగా క్రీడాకారులను నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, కోచ్ పీ.వీ.రమణ తదితరులు అభినందించారు.
రేపటితో ముగియనున్న ‘దోస్త్’ రిజిస్ట్రేషన్
ఖమ్మం సహకారనగర్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) ద్వారా మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు బుధవారంతో ముగియనుందని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు బుధవారం చివరి రోజుకు కాగా... గురువారం వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. అలాగే, రెండో విడత రిజిస్ట్రేషన్లు ఈనెల 30 నుంచి జూన్ 9వరకు ఉంటాయని తెలిపారు. వివరాల కోసం దోస్త్ కోఆర్డినేటర్ సలీం పాషా(98498 41555), టెక్నికల్ అసిస్టెంట్ వేలాద్రి(96188 96949)ని సంప్రదించాలని సూచించారు.