
సమానత్వం కోసం పోరాడేది ఎర్రజెండానే..
● సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
తల్లాడ: సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ స్పష్టం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో సోమవారం రాత్రి సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతుండగా, ఇందుకు పాలకులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. పాలకుల విధానాలతో విద్య, వైద్యం కూడా ఖరీదు కాగా, పేదలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపారు. అసమానతను నిర్మూలించేలా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వేసిన బాట నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఆయన చూపిన బాటలో కమ్యూనిస్టులు నడుస్తూ పాలకపక్షాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని జాన్‌వెస్లీ సూచించారు. తొలుత కుర్నవల్లిలో ర్యాలీ నిర్వహించగా, సీపీఎం నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, కల్యా ణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కర్‌రావు, చలమాల విఠల్, శీలం ఫకీరమ్మ, అయినాల రామలింగేశ్వరరావు, కట్టా దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.