
ఆకట్టుకున్న ‘తితిక్ష’
ఖమ్మంగాంధీచౌక్: గంజాయి మత్తులో తూగుతూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్న కొడుకును తల్లి హత్య చేసిన ఇతివృత్తంగా రూపొందించిన ‘తితిక్ష’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్ దాశరథి థియేటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో నాన్న ఉత్తరం, నా ఆడపిల్ల లఘు చిత్రాలను ప్రదర్శించారు. ముళ్లపూడి ఈశ్వరి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నెలనెలా వెన్నెల నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాటిక ప్రదర్శకులకు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా దాతలు న్యాయవాది జాబిశెట్టి పాపారావు, కొండపల్లి జగన్మోహన్ రావు, వంగవీటి నవీన్ మాట్లాడుతూ.. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఇలాంటి నాటికలు ప్రదర్శించటం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, మార్తి కొండల్‌రావు, నందిగామ కృష్ణ, శానం వీరబాబు, జి.రవీందర్ పాల్గొన్నారు.