
మధిరకు మాస్టర్ ప్లాన్
● జోన్ల వారీగా కన్సల్టెన్సీతో రూపకల్పన ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర: మధిర మున్సిపాలిటీ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మధిర వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ విగ్రహం నుండి క్యాంపు కార్యాలయం వరకు నడిచి వెళ్తూ ఇరుపక్కలా పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు, గృహ, వాణిజ్య జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను అనుభవం కలిగిన కన్సల్టెన్సీకి అప్పగించాలని తెలిపారు. అలాగే, రహదారుల వెంట చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ నిర్మూలనపైనా దృష్టి సారించాలని తెలిపారు. కాగా, రోడ్లపై అక్రమ కట్టడాలు లేకుండా చూస్తూ, ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలని, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని చెప్పారు. అంతేకాక మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
అండర్ గ్రౌండ్ కేబుల్ పనులపై ఆరా
మధిరలో విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయనుండగా ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. మధిరలోని ఆత్కూరు క్రాస్ నుంచి నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్‌ఈ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వరకు భూగర్భంలో కేబుల్ వేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 18 కి.మీ. 11 కేవీ కేబుల్, 12 కి.మీ. పరిధిలో ఎల్‌టీ కేబుల్ వేసేలా సిద్ధం కావాలని తెలిపారు. ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ డీఈలు శ్రీనివాసరావు, హీరాలాల్, ఏడీఈలు అనురాధ, కిరణ్ చక్రవర్తి, నాగమల్లేశ్వరరావు, ఏఈలు అనిల్ కుమార్, అనూష, మైథిలి, గణేష్ పాల్గొన్నారు. కాగా, విద్యుత్ లైన్ పనులపై చర్చిస్తున్న సమయాన అక్కడ ఉన్న మహిళలను డిప్యూటీ సీఎం పలకరించారు. దీంతో వారు తమది దెందుకూరు అని, ఖమ్మం నుంచి వస్తున్నట్లు చెప్పడంతో ఉచిత బస్సు ప్రయాణంపై ఆరా తీశారు.