కార్పొరేట్‌ కళాశాల పిలుస్తోంది.. | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కళాశాల పిలుస్తోంది..

May 18 2025 12:11 AM | Updated on May 18 2025 12:11 AM

కార్ప

కార్పొరేట్‌ కళాశాల పిలుస్తోంది..

● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● నాలుగు జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశానికి అవకాశం ● 107 సీట్ల కోసం ఈనెల 31 వరకు గడువు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌ విద్య కోసం కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని శ్రీచైతన్య, కృష్ణవేణి, రెజొనెన్స్‌, సీవీ రామన్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 107 సీట్లలో ఈ అభ్యర్థులు చేరవచ్చు. రిజర్వేషన్‌ ప్రాతిపదికన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.

వీరికి అవకాశం..

పదో తరగతిలో 7 జీపీఏ లేదా 400 మార్కులకు పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌, ఆశ్రమ, ప్రభుత్వ వసతిగృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, నవోదయ, కేంద్రియ విద్యాలయాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ కళాశాలల్లో చేరేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థినీ విద్యార్థులు తప్పని సరిగా గడిచిన ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, సీబీఎస్‌ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు వారి ఎస్‌ఎస్‌సీ వివరాలు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలోని ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.

రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్లు

ఈ కళాశాలల్లో విద్యను అభ్యసించేందుకు రిజర్వేషన్‌ ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్‌ ఉండగా.. అందులో 9 శాతం మాదిగ, అనుబంధ కులాలకు, 5 శాతం మాల అనుబంధ కులాలకు, ఒక శాతం షెడ్యూల్‌ కులాల్లోని ఇతర కులాలకు కేటాయించారు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ తదితర వాటిల్లో కూడా ఈ రిజర్వేషన్‌ విధానమే అమలు కానుంది. మొత్తం 107 సీట్లలో ఎస్సీలకు 46 సీట్లు కేటాయించారు. అలాగే మైనార్టీలకు 5, ఎస్టీలకు 26, బీసీలకు 17, బీసీ–సీలకు 8, ఈబీసీలకు 5 కేటాయించారు. మొత్తం సీట్లలో 3 శాతం వరకు అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు కేటాయిస్తారు. రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు లేనిపక్షంలో ఇతర కేటగిరిలోని విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తారు.

కావాల్సిన పత్రాలు

అర్హత కలిగిన అభ్యర్థులు ఆయా ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పదో తరగతి ధ్రువీకరణ పత్రం, మీసేవ నుంచి పొందిన కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, వసతి గృహ విద్యార్థి అయితే సంక్షేమ అధికారి ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌ బుక్‌, ఫిజికల్లీ చాలెంజ్‌డ్‌ పత్రాలు ఉండాలి.

అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి..

పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో కార్పొరేట్‌ కళాశాలల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలి. వివరాలు తెలుసుకునేందుకు ఐడీఓసీలోని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించవచ్చు. కస్తాల సత్యనారాయణ,

ఎస్సీ డీడీ, ఖమ్మం

కార్పొరేట్‌ కళాశాల పిలుస్తోంది.. 1
1/1

కార్పొరేట్‌ కళాశాల పిలుస్తోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement