
కాస్త శాంతించిన భానుడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వాతావరణంలో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈనెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని చెబుతుండగా.. అంతకు ముందుగానే వాతావరణంలో మార్పులతో జిల్లాలోని పలుచోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షాలు కురిసాయి. ఈనెల రెండో వారం వరకు 40–45 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా 35–40 డిగ్రీలకు తగ్గాయి. శుక్రవారం గరిష్టంగా బాణాపరంలో 39.7 డిగ్రీలు, కనిష్టంగా గంగారంలో 35.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాత్రి 11గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వాన శుక్రవారం ఉదయం వరకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగగా అత్యధికంగా మధిరలో 31.6 మి.మీ.లు, ఏన్కూరులో 28.6, వేంసూరులో 26.8, ఖమ్మం రూరల్‌లో 25.8, కూసుమంచిలో 22.6, తల్లాడలో 22.2, బోనకల్‌లో 16.4, సింగరేణిలో 13.8, కొణిజర్లలో 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురుస్తుండగా రైతులు భూమిలో తేమ ఆధారంగా అక్కడక్కడా దుక్కులు చేస్తున్నారు. అయితే యాసంగి పంటలకు మాత్రం నష్టం జరుగుతోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్త పడుతుండగా, కోత దశలో ఉన్న మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది.
చల్లబడిన వాతవరణం
వర్షాలు కురుస్తుండడం, ఉష్ణోగ్రతలు తగ్గడంతో జిల్లాలో వాతావరణం కొంత మేర చల్లబడింది. దాదాపుగా రెండు నెలలుగా ఉదయం 9గంటలకు మొదలవుతున్న ఎండ ప్రభావం ప్రభావం రాత్రి వరకు కొనసాగుతోంది. కానీ గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షంతో చల్ల బడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.
పలుచోట్ల వాన, చల్లబడిన వాతావరణం