
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: రైతులు పండించిన ధాన్యమంతా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని.. ఈక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లోనే రైతులకు ఖాతాలో డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగ్‌లు, టార్పాలిన్ కవర్లు సమకూర్చాలని సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్, ఆతర్వాత అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డీఎం శ్రీలత, వివిధ శాఖల అధికారులు గంగాధర్, సన్యాసయ్య, పుల్లయ్య, ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు.