
బస్సు, లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
సత్తుపల్లి: ప్రైవేట్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు 20 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం ప్రైవేట్ బస్సు వెళ్తోంది. ఈక్రమాన కిష్టారం ఓసీ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనగా రాజమండ్రికి చెందిన ప్రయాణికులు రమేష్, అమ్మాజి, వినాయకుడు, సూర్యారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాక బస్సు డ్రైవర్ సోమరాజు క్యాబిన్‌లో ఇరుక్కుపోవటంతో ట్రెయినీ ఎస్సై అశోక్‌కుమార్, సిబ్బంది రవీంద్రనాధ్, నాగుల శ్రీనివాసరావు చేరకుని అతికష్టంగా ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 5–30గంటలకు జరగగా, ఉదయం 10 గంటల వరకు సత్తుపల్లి–ఖమ్మం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తుపల్లి పోలీసులు సింగరేణి నుంచి క్రేన్లను రప్పించి బస్సు, లారీని విడదీసి పక్కకు పెట్టాక రాకపోకలను పునరుద్ధరించారు.
వైరా హైలెవల్ వంతెనపై...
వైరారూరల్: వైరా మండలం స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై శుక్రవారం ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్నాయి. భద్రాచలం నుండి వస్తున్న డీలక్స్ బస్సు, వైరా నుండి తల్లాడ వైపు వెళ్తున్న లారీ వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.