మండుటెండలో సాధువు పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో సాధువు పాదయాత్ర

May 16 2025 12:28 AM | Updated on May 16 2025 12:28 AM

మండుటెండలో సాధువు పాదయాత్ర

మండుటెండలో సాధువు పాదయాత్ర

మధిర: నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కానీ, ఒక సాధువు మండుటెండలో పాదయాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన సాధువు కాశీ నుంచి రామేశ్వరానికి పాదయాత్రగా బయలుదేరగా, 54వ రోజైన గురువారం మధిర చేరుకున్నాడు. పరమశివుడిపై నమ్మకంతోనే 58 ఏళ్ల వయస్సులో ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఏకలవ్య విద్యాలయాల్లో ఇంటర్‌ ప్రవేశాలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది ఏకలవ్య మోడల్‌ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో ఒక విద్యాలయం ఉండగా, 2024–25లో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. సీబీసీఎస్‌ సిలబస్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమనిటిక్స్‌ గ్రూపుల్లో ప్రవేశానికి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గండుగులపల్లి, గుండాలలో బాలికలకు ఎంపీసీ, సీఈసీ, పాల్వంచలో బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు, టేకులపల్లిలో బాలురకు బైపీసీ, సీఈసీ, దుమ్మగూడెంలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, హ్యూమనిటిక్స్‌ గ్రూపులు, చర్ల, ములకలపల్లి, సింగరేణిలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో బోధన ఉంటుందని, పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని పీఓ వెల్లడించారు. కాగా, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 26న ఉదయం చర్ల, భద్రాచలంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

మహిళా సంఘాలకు

చెరువుల వన సంరక్షణ బాధ్యత

ఖమ్మంమయూరిసెంటర్‌: మహిళా సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పలు పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల గట్లపై వన సంరక్షణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఖమ్మం కార్పొరేషన్‌ కార్యాలయంలో మెప్మా అధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంసీ సుజాత మాట్లాడుతూ జూన్‌ 2న చెరువుల వన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎంపిక చేసిన చెరువుల బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. చెరువు కట్టలపై మొక్కలు నాటడం, వాటి పెంపకం బాధ్యతలను సభ్యులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఖమ్మంలో ఖానాపురం ఊర చెరువు, ధంసలాపురం చెరువు, వైరాలో సోమవారం చెరువు, సత్తుపల్లిలో వేశ్వకాంతుల చెరువు, మధిరలో అంబారుపేట చెరువులను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.

వివాదాస్పద భూముల్లో

పంచనామా

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మం అర్బన్‌లోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూముల్లో తహసీల్దార్‌ రవికుమార్‌ గురువారం పంచనామా నిర్వహించారు. ఇక్కడి మూడు సర్వే నంబర్లలో సుమారు 30 ఎకరాల అసైన్డ్‌ భూముల విషయంలో కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు, ప్రభుత్వం, పేదల మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసు దాఖలైంది. విచారణలో ఉండగా రైతులు ఈ ఏడాది పంటల సాగు చేపట్టారు. పంటకాలం పూర్తయిన తర్వాత వివాదాన్ని పరిష్కరించే వరకు ఎవరూ పనులు చేపట్టొద్దని, ప్రభుత్వం సైతం ఈ భూములను ఎవరికీ కేటాయించొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దార్‌ రవికుమార్‌ పంటలు సాగు చేసిన రైతులతో మాట్లాడారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పంచనామా చేసినట్లు తహసీల్దార్‌ రవికుమార్‌ వెల్లడించారు.

గాయపడిన వ్యక్తి మృతి

చింతకాని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖమ్మం అర్బన్‌ మండలం గోపాలపురానికి చెందిన కొర్రా లోకేశ్‌ (24) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రైవేట్‌ బ్యాంక్‌లో పనిచేసే ఆయన ద్విచక్ర వాహనంపై ఈ నెల 7వ తేదీన చింతకాని మండలం ప్రొద్దుటూరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోకేశ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement