
నాణ్యతతోనే మామిడికి ధర
● పిందె మొదలు కాయ వరకు జాగ్రత్తలు తప్పనిసరి ● రవాణా, ఎగుమతుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ ప్రధానం
ఖమ్మంవ్యవసాయం: మామిడి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు కోతలు మరింత కొనసాగే అవకాశముంది. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 44,864 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇందులో బంగినపల్లి, తోతాపురి, రసాలు, హిమాయత్, దసేరి, మల్లికా, మంజీర, సువర్ణరేఖ, జహంగీర్ రకాలను సాగు చేస్తుండగా.. ఈ మొత్తం విదేశీ ఎగుమతులకు అనుకూలమైన రకాలుగా ఉండడం విశేషం. మామిడికి ప్రస్తుతం రకాలు, నాణ్యత ఆధారంగా టన్నుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. ఏమాత్రం నాణ్యత తక్కువగా ఉన్నా వ్యాపారులు ధర పెట్టడం లేదు. కేవలం చెట్టుపై నిలిచిన పంటకే డిమాండ్ ఉన్న నేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ పలు సూచనలు చేశారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎగుమతుల కోసమైనా, దేశీయంగా అమ్మకానికై నా రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చెట్టుపై బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగు కలిగిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమాన కండ కలిగి లేత పసుపు పచ్చ రంగు ఉన్నవి గుర్తించాలి. కాయలను 6 – 7 సెంటీమీటర్ల తొడిమ, భూమికి దగ్గరగా ఉన్న కాయలైతే 2 – 3 సెం.మీ. తొడిమతో కోయాలి. కాయ కింద పడకుండా చిక్కం ఉపయోగించాలి. ఆపై రవాణా కోసం ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగాన కాగితాలను అమర్చాలి. ఆపై కాయలను జాగ్రత్తగా పేర్చడంతో పాటు ఈ సమయంలో తొడిమ వద్ద సొన కాయపై చర్మానికి అంటకుండా చూడాలి. అనంతరం ప్యాక్ హౌస్‌లోనే శుద్ధి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు.
ఉమ్మడి జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడులు
జిల్లా సాగు విస్తీర్ణం సాధారణ దిగుబడి
(ఎకరాల్లో) (టన్నుల్లో)
ఖమ్మం 33,908 1,35,632
భధ్రాద్రి కొత్తగూడెం 10,956 43,824
మొత్తం 44,864 1,79,456

నాణ్యతతోనే మామిడికి ధర