
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
నృసింహస్వామికి చక్రస్నానం..
శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పవిత్ర గౌతమీ నదిలో చక్ర స్నానం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు, మహిళా భక్తుల కోలాట నృత్యాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లి నదీ జలాలతో చక్ర స్నానం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హజరై ఈ వేడుకను తిలకించి పులకించారు.