
వడదెబ్బతో ముగ్గురు మృతి
కామేపల్లి: కామేపల్లి ఇరిగేషన్ సబ్‌డివిజన్‌లో లష్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బండి రాజమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఏఈఈ శ్యామ్, ఉద్యోగులు పలువురు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.
ఖమ్మంలో యాచకుడు..
ఖమ్మంక్రైం: ఖమ్మం మామిళ్లగూడెం ఓవర్‌బ్రిడ్జి సమీపాన ఓ యాచకుడు గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని పరిశీలించారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
శుక్రవారిపేట వాసి...
ఖమ్మంరూరల్: ఖమ్మం శుక్రవారిపేటకు చెందిన ఎస్‌కే రఫీబాబు (44) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. రూరల్ మండలం గుర్రాలపాడులో ఉంటున్న సోదరుడి వద్దకు బయలుదేరిన ఆయన వెంకటగిరిలోని ఇందిరమ్మ కాలనీ సమీపాన రహదారి పక్కన పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆయన కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోగా రఫీబాబు మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.