
ఆదివాసీల అంగడి.. సందడి..
భద్రాచలంటౌన్: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు గతంలో తమ కుటుంబం వరకు కావాల్సిన కూరగాయలు, ఇతర పంటలే పండించేవారు. కానీ పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ భారంతో పంటల సాగు కొద్దికొద్దిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమాన ఆదివాసీలు రసాయన ఎరువులు వాడకపోవడంతో పంటలు నాణ్యంగా ఉంటుండడమే కాక ధరల్లోనూ బయటి మార్కెట్‌తో వ్యత్యాసం ఉండడంతో పట్టణవాసులు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం ఆకుకూరలు, కూరగాయలే కాక అటవీ ఫలాలు సైతం అమ్ముతున్న ఆదివాసీలు కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు.
భద్రాచలంలో ప్రత్యేకం..
రాష్ట్ర విభజన సమయాన ఏపీలోకి వెళ్లిన పలు గ్రామాలు, మండలాల నుంచి ఆదివాసీలు తాము సాగు చేసిన పంటలను భద్రాచలంలో విక్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాత కూరగాయల మార్కెట్‌లోని ఐటీడీఏ కాంప్లెక్స్ ముందు ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఆదివాసీ గిరిజనులు మాత్రమే కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తుండగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆదివాసీ అంగడి 11 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు కొద్దిసేపటల్లో అమ్ముడవుతుండడం విశేషం.
అన్నీ తాజాగా..
సాధారణ మార్కెట్ కంటే ఇక్కడ లభించే కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉంటాయి. తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే ఆదివాసీలు ఏరోజుకారోజు సేకరించి తీసుకొస్తుండడంతో తాజాగా ఉంటాయని చెబుతున్నారు. అందులోనూ పంటల సాగు రసాయన ఎరువులు వాడకపోవడంతో నాణ్యంగా ఉంటాయని స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాక బయటి మార్కెట్‌తో ధరకూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.
పెరుగుతున్న అమ్మకాలు
భద్రాచలంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ కంటే ఆదివాసీలు నిర్వహించే అంగడి పట్టణవాసులతో సందడిగా ఉంటోంది. భద్రాచలం పరిసర గ్రామాల్లో సాగు చేసే కూరగాయలను తీసుకొస్తుండగా రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఏపీలోని సరిహద్దు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, కుక్కునూరు నుంచి భారీగా కూరగాయలను సైతం తీసుకొస్తున్నారు. ఇవి కాక సీజన్ ఆధారంగా సీతాఫలాలు, తునికిపండ్లతో పాటు చింతపండు, మినుములు, పెసళ్లు, బొబ్బర్లు, కందులు సైతం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
నాణ్యమైన, తాజా కూరగాయల విక్రయం
ధరలోనూ బయటి మార్కెట్‌తో పోలిస్తే తక్కువ
కొనుగోలుకు పట్టణవాసుల ఆసక్తి
మందులు లేని పంటలు
ఇక్కడ మార్కెట్‌లో లభించే కూరగాయలు తాజాగానే కాక స్వచ్ఛంగా ఉంటాయి. గిరిజనులు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పండిస్తుంటారు. దీంతో ఇవి ఆరోగ్యానికి మంచివని నాతోపాటు చాలా మంది ప్రతిరోజు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. –శంకర్, భద్రాచలం

ఆదివాసీల అంగడి.. సందడి..