
కిన్నెరసానిలో పుట్టి తిరిగేనా..?
పాల్వంచరూరల్ : కిన్నెరసానికి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కెనాల్‌లో పుట్టి ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీచేశారు. అయితే ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు అచరణలోకి రాలేదు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో రిజర్వాయర్ నుంచి కేటీపీఎస్ కర్మాగారానికి నీరు సరఫరా చేసే కాల్వలో పుట్టి(నాటు పడవ) తిప్పాలని గత డిసెంబర్‌లో కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎండీ ఇంతియాజ్ అహ్మద్‌ఖాన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన నెల రోజుల క్రితం రూ.33 వేలతో పుట్టి కొనుగోలు చేసి పునుకుల గ్రామానికి చెందిన మత్స్యకారుడికి అప్పగించారు. కెనాల్లో పుట్టిని ఎలా తిప్పాలో శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఆ పుట్టి కాలువలో తిరగడం లేదు. దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిని వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే పుట్టిని కొనుగోలు చేసి మత్స్యకారుడికి అప్పగించామని, అతడు సొంత పనులు పూర్తి చేసుకున్నాక తిప్పుతామని చెప్పాడని తెలిపారు. పుట్టి విషయం పర్యాటకులకు తెలిసేలా ప్రధాన ద్వారం, పంపుహౌస్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. అయితే, కాలువ నీటిలో పుట్టిని తిప్పాలంటే మధ్యలో పంప్‌హౌస్ గేట్‌వాల్వ్‌ను తొలగించాల్సి ఉంటుంది. ఈ పని పూర్తి చేసి వచ్చే ఆదివారం నాటికై నా కెనాల్‌లో పుట్టిని తిప్పేలా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు.
కలెక్టర్ ఆదేశించి
ఐదునెలలైనా ఆచరణ శూన్యం