
జాతీయ కార్మిక సంఘాల సమ్మె జూలై 9కి వాయిదా
సింగరేణి(కొత్తగూడెం): కార్మిక రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 20న సమ్మె చేపట్టనున్నట్లు జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించగా, దీన్ని జూలై 9కి వాయిదా వేసినట్లు సంఘాల జేఏసీ నాయకులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నెల 20న పని ప్రదేశాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సింగరేణి ఆస్పత్రిలో
సీఎండీ తనిఖీ
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర వార్డు సహా అన్ని వార్డుల్లో పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. ఆ తర్వాత ఫార్మసీని పరిశీలించి మందుల లభ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నందున వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందించాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎంఓ కిరణ్‌రాజ్‌కుమార్, ఏసీఎంఓలు ఎం.ఉష, సునీల, సీనియర్ పీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.