
సహజ సేద్యంపై రైతులకు ప్రోత్సాహం
ఖమ్మంవ్యవసాయం: రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటుచేయగా, కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడంతో పంటల్లో పోషక విలువలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు ఎరువులు అధికంగా వాడుతుండడంతో రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు పంట దిగుబడిలో నాణ్యత ఉండటం లేదన్నారు. ఈనేపథ్యాన సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, ముందుకొచ్చే రైతుల పొలాల వద్ద భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. రైతులతో సంప్రదించేలా గ్రామానికి ఇద్దరు చొప్పున రైతు మిత్రలను ఎంపిక చేయాలన్నారు. కాగా, ఈ విధానంలో పండించిన పంటల అమ్మకానికి ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి మాట్లాడుతూ తాను 25ఏళ్లుగా వర్మి కంపోస్ట్ తయారుచేసి ఉపయోగించడమే కాక ఇతరులకు ఇస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు సహజ విదానాల్లో పంటలు సాగుకు ముందుకొస్తారన్నారు. అలాగే, ఇన్‌పుట్ యూనిట్ల పంపిణీపై దృష్టి సారించాలని కోరారు.
సేంద్రియ పంటల అమ్మకానికి
ప్రత్యేక మార్కెట్
కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్