
చిన్నారుల పెద్దమనసు
● కిడ్డీ బ్యాంక్ నగదుతో మజ్జిగ పంపిణీ
సత్తుపల్లిటౌన్: పిల్లలంతా మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వారే.. కానీ ఎండలతో బాటసారుల ఇబ్బందులను గుర్తించి పెద మనస్సు కనబరిచారు. సత్తుపల్లి గాంధీనగర్‌కు చెందిన మౌలిక్, ఇడుపులపాటి క్రితిక్, కొమ్ముగిరి వర్ధిని, హర్షిని, నందికోళ్ల సంజయ్, జి.సారిక, కన్నెపోగు జశ్వంత్ తమ కిడ్డీ బ్యాంక్‌లో దాచిన నగదుతో బుధవారం పెరుగు కొని మజ్జిగ చేయించారు. ఆపై ఇళ్ల ముందే చిన్నారులంతా కలిసి కర్రలతో పందిరి వేసి వీధిలో వెళ్తున్న మజ్జిగ పంపిణీ చేయగా పలువురు అభినందించారు.
విద్యుత్ శాఖలో
ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
ఏప్రిల్ నెల జాబితాలో ఐదుగురు
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరును ప్రదర్శించే అధికారులు, ఉద్యోగులకు ప్రతినెలా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్పీడీసీఎల్ పునరుద్ధరించింది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ప్రారంభించినా కొన్నాళ్ల తర్వాత నిలిచిపోయింది. తిరిగి విద్యుత్ సరఫరా, అంతరాయాల నిర్వహణ, సత్వర సేవ, వసూళ్లు తదితర అంశాల ఆధారంగా ఏప్రిల్ నెలకు గాను ఐదుగురు అధికారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం ఎస్‌ఈ ఈ.శ్రీనివాసాచారి తెలిపారు. ఇందులో ముదిగొండ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ ఎం.శ్రీనివాసరావు, ఖమ్మం టౌన్–5 ఏఈ జిరుపయ్య, సత్తుపల్లి ఏడీఈ బి.ప్రసాద్‌బాబు, ఖమ్మం టౌన్–1 ఏడీఈ నాగార్జున, సత్తుపల్లి డీఈ(ఆపరేషన్స్) ఎల్.రాములు ఉన్నారని వెల్లడించారు.
అవసరానికి మించి
ఎరువులు వాడొద్దు
సత్తుపల్లిరూరల్: సాగు చేసే పంటలు, భూసా రం ఆధారంగా అధికారులు, శాస్త్రవేత్తల సిఫా రసు మేరకు ఎరువులు ఉపయోగించాలని, అంతకు మించి వాడితే ఫలితం ఉండకపోగా ఖర్చు పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్‌కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంగారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేయడంతో పాటు పంట అవశేషాలను కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ఆతర్వాత ఏఓ వై. శ్రీనివాసరావు పలు సూచను చేయగా, సొసైటీ చైర్మన్ ఎం.వెంకటరెడ్డి, శాస్త్రవేత్తలు ఎం.రాంప్రసాద్, డాక్టర్ ఆర్.రమేష్, ఉద్యానవన అధికారి శ్రావణి, పశుసంవర్ధక శాఖ వైద్యులు శశిదీప్, ఏఈఓ వాసంతి పాల్గొన్నారు.
కాస్త నెమ్మదించిన సూరీడు
ఖమ్మంవ్యవసాయం: సూర్యుడి తన ప్రతాపాన్ని బుధవారం కాస్త తగ్గించాడు. జిల్లాలో మంగళవారం 40–45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం అది 35–40 డిగ్రీలకు పడిపోయింది. కాగా, బుధవారం పమ్మిలో గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సత్తుపల్లి ఓసీ, బాణాపురంలో 39.6, గంగారం, వైరా ఏఆర్‌ఎస్ 39.3, వేంసూరులో 39.1 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, బచ్చోడులో 38.9, చింతకానిలో 38.8, నేలకొండపల్లిలో 38.7, ముదిగొండ 38.5, ఎర్రుపాలెం, ఖమ్మం ప్రకాష్‌నగర్, కలెక్టరేట్ వద్ద 38.4, పెనుబల్లిలో 38.3, గౌరారం, మధిర, కూసుమంచిలో 38.2, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెద్దగోపతి, కుర్నవల్లిలో 38.1, ఖమ్మం ఖానాపురం, పల్లెగూడెంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఆ ప్రభావం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రత తగ్గిందని భావిస్తున్నారు. అయితే, ఉక్కపోత ఏ మాత్రం తగ్గకపోవడంతో జనం సతమతమయ్యారు.
సీఐల బదిలీ, పోస్టింగ్
ఖమ్మం క్రైం: పోలీసు శాఖలోని మల్టీజోన్–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పీటీసీలో ఆన్ డ్యూటీపై ఉన్న జి.శ్రీకాంత్‌గౌడ్‌ను ఖమ్మం ట్రాఫిక్ సీఐగా కేటాయించారు. అలాగే, ఖమ్మం టాస్క్‌ఫోర్ సీఐగా వెయింటింగ్‌లో ఉన బి.బాలాజీని నియమించారు. అంతేకాకుండా కొత్తగూడెం టుటౌన్ సీఐగా వెయిటింగ్‌లో ఉన్న డి.ప్రతాప్‌ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న టి.రమేష్‌కుమార్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

చిన్నారుల పెద్దమనసు