
బోధన మరింత కొత్తగా!
● ఉపాధ్యాయులను సన్నద్ధం చేసేలా వివిధ అంశాల్లో శిక్షణ ● విడతల వారీగా ఐదు రోజుల పాటు నిర్వహణ
ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక కొన్నాళ్లకు దశల వారీగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందించేవారు. ఆపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బడి తెరిచిన మొదటిరోజే పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నారు. అంతేకాక పాఠశాల పనిదినాలు వృథా కాకుండా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నారు. బోధనలో సరికొత్త మార్పులు తీసుకొచ్చే దిశగా ఏర్పాటుచేసిన ఈ శిక్షణ మొదటి విడత జిల్లాలో మొలైంది.
ప్రారంభమైన శిక్షణ తరగతులు
జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతగా ఈనెల 13న ఖమ్మంలో శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉపాధ్యాయులు 326 మంది, గణితం 453, సోషల్ 436 మంది ఉపాధ్యాయులతో పాటు మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు 168 మంది, మండలానికి ఎనిమిది మంది చొప్పున స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బోధనలో చేయాల్సిన మార్పులపై వివరిస్తూనే డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ ఆధారిత బోధన, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించేలా నిపుణులు వివరిస్తున్నారు. కాగా, మూడు విడతల శిక్షణలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఉపాధ్యాయుడు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ప్రారంభించగా, బుధవారం ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.
వృత్తి నైపుణ్యాల పెంపు
ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ వృత్తి నైపుణ్యాల పెంపునకు దోహదపడుతుంది. బోధనా విధానాలు, వ్యూహాలు, ఫలితాల సాధన, సమగ్ర మూల్యాంకకానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల నమోదు పెంచేలా చేయాల్సిన కృషిని వివరించారు.
– వి.రాజశేఖర్, జెడ్పీహెచ్‌ఎస్, తుమ్మలపల్లి
బోధనకు ఉపయోగం
ఇక్కడ ఇచ్చిన శిక్షణ డిజిటల్ బోధనను మరింత సులువు చేయనుంది. స్మార్ట్ టీవీల ఉపయోగం, వెబ్‌సైట్ల పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించే అవకాశముంటుంది.
– ఎన్.సుధాకర్‌రావు, జెడ్పీహెచ్‌ఎస్, ప్రొద్దుటూరు
మెరుగైన బోధన కోసం...
కోర్సులో భాగంగా రూపొందించిన అంశాలన్నీ ఉపాధ్యాయులకు ఉపయోగపడేవే. తరగతి గదిలో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు వినేలా బోధించడానికి ఇవి కీలకంగా నిలుస్తాయి. డిజిటల్ బోధన కూడా మరింత మెరుగుపడనుంది.
– కె.శైలజలక్ష్మి, కోర్సు కోఆర్డినేటర్, ఖమ్మం

బోధన మరింత కొత్తగా!

బోధన మరింత కొత్తగా!

బోధన మరింత కొత్తగా!