
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: భార్యకు మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని సిద్ధారం గ్రామానికి చెందిన రాయిని రామారావు(39) తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానిస్తుండగా తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆతర్వాత గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో రామారావు గొడవ పడగా, మంగళవారం రాత్రి తన ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుకు చీరతో ఊరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి
పెనుబల్లి: నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని లింగగూడెంకు చెందిన గరిక నాగయ్య(85) ఈనెల 6తేదీన బీడీ కాల్చుకునే క్రమంలో అగ్గిపుల్ల మంచంపై ఉన్న దిండుపై పడి నిప్పంటుకుంది. ఆపై మంటలు పెద్దవై నాగయ్య శరీరానికి అంటుకోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు నాగయ్యను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీఎం బంజర్ ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.
గాయపడిన వ్యక్తి...
పెనుబల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం రఘునాథగూడెంకు చెందిన రామిశెట్టి రామారావు(45) గత నెల 24న పెనుబల్లి మండలం టేకులపల్లికి వచ్చివెళ్తూ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడ్డాడు. దీంతో ఆయనకు గాయాలు కాగా, పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రామారావు మృతి చెందగా, ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు.
వడదెబ్బతో కూలీ..
నేలకొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. మండలంలోని చెరువుమాధారానికి చెందిన ఎస్. దానయ్య(55) రోజులాగే బుధవారం ఉపాధిహామీ పనికి వెళ్లాడు. అక్కడ ఎండ కారణంగా అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి వచ్చాక బంధువులతో మాట్లాడుతూనే కుప్పకూలాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దానయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, పని ప్రదేశాల వద్ద తగిన సౌకర్యాలు లేకపోవడమే ఆయన మృతికి కారణమని పలువురు పేర్కొన్నారు.