
ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అస్థిత్వం
ఖమ్మంరూరల్: అన్ని వర్గాల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే కీలకమని, తద్వారా వారికి సొంత అస్థిత్వం సొంతమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్‌లో ఉన్న రైసెట్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. సీఎస్‌సీ పాయింట్ల ఏర్పాటులో శిక్షణ తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కొంత వివక్ష ఉందని, దీని నిర్మూలనకు అంతా కృషి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళల ఆర్థికాభివృద్ధికి సిటిజన్ సర్వీస్ సెంటర్లు, షీ జిరాక్స్ సెంటర్లను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో రైసెట్ డైరెక్టర్ సి.చంద్రశేఖర్, ఏపీఓ నూరొద్దీన్, సీఎస్‌సీ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లలతో ఇళ్లంతా సంతోషం
ఎర్రుపాలెం: ఆడపిల్లలు ఉన్న ఇళ్లు సంతోషాలకు చిరునామాగా నిలుస్తాయని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరంలోని ఆడపిల్లకు జన్మనిచ్చిన గూడూరు కోటేశ్వరి– లక్ష్మీనారాయణరెడ్డితో పాటు వారి కుటుంబీకులను కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు ప్రతీ రంగంలో రాణిస్తున్నందున సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ క్టర్ బి.కళావతిబాయి, ఏసీడీపీఓ జి.కృష్ణశ్రీ, ఎంపీడీఓ బి.సురేందర్, సూపర్‌వైజర్లు సరిత, మధులత, సునీత పాల్గొన్నారు.
కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్